కఠిన నిబంధనల నడుమ నేడు నీట్ ఎగ్జామ్‌

by  |
Neat exam today
X

దిశ, తెలంగాణ బ్యూరో: నీట్ పరీక్షకు సర్వం సిద్దమైంది. నేడు దేశ వ్యాప్తంగా 16 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారు. గతేడాది 15.97లక్షల మంది విద్యార్థులు పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోగా 13లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ సారి దేశ వ్యాప్తంగా మొత్తం 202 నగరాల్లో మొత్తం 3,842 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్, పెన్ మోడ్‌లో జరుగనున్న ఈ పరీక్షను మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహించనున్నారు.

పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాల్సి ఉంటుందని, నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కఠిన నిబంధనలు విధించింది. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు లక్ష మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా తెలంగాణలో 7 నగరాల్లో 112 పరీక్షా కేంద్రాలను, ఏపీలోని 9 నగరాల్లో 151 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు తప్పనసరిగా మాస్క్ ధరించి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలకు హాజరుకావాల్సి ఉంటుంది. థర్మల్ స్క్రీనింగ్ తర్వాత విద్యార్థులను పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తారు. నిబంధనల్లో సూచించిన విధంగా పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు.

ఈసారి నీట్‌లో స్వల్ప మార్పులు చేపట్టారు. ఇద్దరికి ఒకే విధమైన మార్కులు వస్తే, నెగెటివ్‌ మార్కులు తక్కువగా వచ్చిన వారికి ముందు ర్యాంకు ఇవ్వనున్నారు. 3గంటల వ్యవధిలో 200 ప్రశ్నలకు గాను 180 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. విద్యార్థుల అవగాహన కోసం ఎన్‌టీఏ మోడల్‌ ఓఎంఆర్‌ షీట్‌ను వెబ్‌సైట్ లో పొందుపరిచింది.

Next Story

Most Viewed