వెంకయ్యకు ప్రధాని మోడీ లేఖ..

by Dishanational4 |
వెంకయ్యకు ప్రధాని మోడీ లేఖ..
X

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసిన వెంకయ్య నాయుడుకు గురువారం ప్రధాని మోడీ లేఖ రాశారు. మూడు పేజీల ఈ సుదీర్ఘ లేఖలో వెంకయ్య నాయుడు గురించి పలు అంశాలను ప్రస్తావించారు. నెల్లూరులోని సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన వెంకయ్య నాయుడు.. అంచెలంచెలుగా ఎదిగిన విధానాన్ని ఆయన తెలిపారు. శక్తి సామర్థ్యాలను, స్ఫూర్తిదాయకమైన మాటలపై మాట్లాడారు. ఎంపీగా.. కేంద్ర మంత్రిగా.. రాజ్యసభ చైర్మన్‌గా, ఉపరాష్ట్రపతిగా ఏ పదవిని చేపట్టినా అందులో వెంకయ్యనాయుడు ప్రత్యేకతను చాటుకున్నారని ఆయన పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు ప్రసంగాలు వింటే వినోబా భావే గుర్తుకు వస్తారని, ఆయన రచనల్లో ఎక్కడ ఏ పదం వాడుతారో.. అలాగే వెంకయ్య నాయుడు కూడా సందర్భాన్ని బట్టి పదాలను వాడుతారన్నారు. సొంత రాష్ట్రంలో రాజకీయ బలం లేకపోయినా.. పార్టీ పట్ల నిబద్ధత, విశ్వాసం పరంగా బీజేపీకి దిక్సూచీగా నిలిచారని ఆయన ప్రశంసించారు.

కొత్తగా ఎన్నికైన సభ్యులకు వెంకయ్య నాయుడు సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తారని, వారిలో ఉన్న టాలెంట్‌ను గుర్తించి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తారని పేర్కొన్నారు. వెంకయ్యనాయుడు క్రమ శిక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్నారు. క్రమశిక్షణ తప్పినా రోజు ఆయన ఎంతో బాధపడేవారని మోడీ తెలిపారు. రాజ్యసభ చైర్మన్‌గా వెంకయ్య నాయుడు నిర్వహణ తీరు ఎప్పటికీ అందరి గుండెల్లో నిలిచిపోతుందన్నారు. ఆయన ఆధ్వర్యంలో అనేక చారిత్రాత్మక బిల్లులకు ఆమోదం జరిగాయన్నారు. 2014లో తన కేబినెట్‌లో అర్బన్ వ్యవహారాల శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు ఉన్నారు. అప్పుడు దేశంలో మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించడంలో వెంకయ్య నాయుడు ఎంతో కృషి చేశారన్నారు. అలాగే సామాన్యులకు గృహాలు అందిచడం.. 'ఈజ్ ఆఫ్ లివింగ్'ను విస్తరించడానికి వ్యవహరించిన తీరు ప్రశంసదాయకమన్నారు.

వెంకయ్య నాయుడు చమత్కారంగా మాట్లాడుతారని, ఒకే లైన్‌తో ఆలోచింపజేసేలా మాట్లాడుతారని మోడీ పేర్కొన్నారు. అయిదు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎన్నో పదవులు చేపట్టిన ఆయన.. సొంతంగా ఆ పదవి కావాలని ఎవరిని అడగలేదని మోడీ తెలిపారు. పార్టీ పెద్దల అభిమానంతోనే పదవులు దక్కాయని చెప్పుకొచ్చారు. ఉపరాష్ట్రపతిగా పదవీ విరమణ చేసినా.. ఇంతే ఉత్సాహంతో రానున్న రోజుల్లోనూ జీవితాన్ని సంతోషంగా గడపాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు.


Next Story