మాకొద్దీ దత్తపుత్రుడు.. చెడు అలవాట్లున్నాయ్.. కోర్టు తీర్పు ఇదీ

by Dishanational4 |
మాకొద్దీ దత్తపుత్రుడు.. చెడు అలవాట్లున్నాయ్.. కోర్టు తీర్పు ఇదీ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఓ బాలుడిని దత్తత తీసుకున్న దంపతులు.. అతడికి చెడు అలవాట్లు ఉన్నాయన్న సాకుతో దత్తత రద్దుకు సిద్ధమయ్యారు. ఆ బాలుడిని దత్తత ఇచ్చిన బాల్ ఆశా ట్రస్టుకు ఈవిషయాన్ని చెప్పారు. దీనిపై 2023 డిసెంబరులో ఆ ట్రస్టు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. బాలుడి దత్తతను రద్దు చేసింది. బాలుడి పేరిట డిపాజిట్ చేసిన రూ.2 లక్షలను ఆ దంపతులకు తిరిగి ఇచ్చేయాలని సంబంధిత ప్రభుత్వ శాఖను ఆదేశించింది. దత్తత కోసం సిద్ధంగా ఉన్న పిల్లల జాబితాలో ఆ బాలుడి పేరును మళ్లీ చేర్చాలని సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా)కి హైకోర్టు నిర్దేశించింది. దత్తత తీసుకున్న తల్లిదండ్రులు బాలుడికి సంబంధించిన అన్ని ఒరిజినల్ రిపోర్టులు, పత్రాలను వెంటనే బాల్ ఆశా ట్రస్టుకు అందజేయాలని సూచించింది. దీంతో 2023 ఆగస్టు 17న దత్తతపై వెళ్లిన బాలుడు కనీసం ఆరు నెలలైనా గడవకముందే తిరిగి బాల్ ఆశా ట్రస్టుకు తిరిగి వచ్చేశాడు. ‘‘ఆ బాలుడితో మేం ఎమోషనల్‌గా కనెక్ట్ కాలేకపోయాం. అతడికి చెడు అలవాట్లు ఉన్నాయి. ఎంత చేసినా మా కంట్రోల్‌లోకి రావడం లేదు’’ అని కోర్టుకు సమర్పించిన సమాధానంలో ఆ దంపతులు పేర్కొన్నారు. ట్రస్ట్ సలహా మేరకు దత్తత తీసుకున్న తల్లిదండ్రులు రెండు ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెషన్లకు హాజరయ్యారు. ‘‘ఆ బాలుడు దత్తత తీసుకున్న తల్లిదండ్రులను, వారి ఏడేళ్ల పెద్ద కుమార్తెను ఇష్టపడ్డాడు. కానీ ఆ బాలుడితో తల్లిదండ్రులే ఎమోషనల్ అటాచ్‌మెంట్‌ను పెంచుకోలేకపోయారు’’ అని కోర్టుకు సమర్పించిన నివేదికలో కౌన్సెలర్ పేర్కొనడం గమనార్హం.



Next Story

Most Viewed