బెంగాల్‌లో మహిళలకు రక్షణ లేదు: టీఎంసీపై ప్రధాని మోడీ ఫైర్

by Dishanational2 |
బెంగాల్‌లో మహిళలకు రక్షణ లేదు: టీఎంసీపై ప్రధాని మోడీ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వంపై ప్రధాని మోడీ మండిపడ్డారు. టీఎంసీ పాలనలో రాష్ట్రంలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎంసీపై మహిళలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలిపారు. పశ్చిమ బెంగాల్ పర్యటనలో ఉన్న మోడీ దేశంలోనే తొలి అండర్ వాటర్ మెట్రోను ప్రారంభించారు. అనంతరం ఉత్తర 24పరగణాస్ జిల్లా సందేశ్ ఖాలీలోని బరాసత్‌లో నిర్వహించిన నారీ శక్తి వందన్ సభలో మోడీ మాట్లాడారు. టీఎంసీ పాలనలో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని ఆరోపించారు. సందేశ్ ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన నిందితుడిని రక్షించేందుకు టీఎంసీ ప్రభుత్వం తన శక్తినంతా ఉపయోగిస్తోందని విమర్శించారు. బాధ్యులను రక్షించేందుకు ప్రయత్నిస్తోందని తెలిపారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే మహిళా శక్తికి ఎక్కువ అవకాశాలు కల్పించాలన్నారు. బీజేపీ ప్రభుత్వం వల్ల నేడు ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారని కొనియాడారు. బెంగాల్‌లో టీఎంసీకి గ్రహణం పట్టడం వల్ల రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగడం లేదన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఇండియా కూటమిని ఓడించాలని పిలుపునిచ్చారు.

విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణం

కోల్‌కతాలో అండర్ వాటర్ మెట్రోను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోడీ విద్యార్థులతో కలిసి మెట్రోలో ప్రయాణించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన కార్మికులతోనూ మాట్లాడారు. కాగా, ఈ మెట్రో రైలు భూమికి 33 మీటర్ల లోతులో, హుగ్లీ నది స్థాయికి 13 మీటర్ల దిగువన నిర్మించిన ట్రాక్‌పై నడుస్తుంది. ఇందుకోసం హౌరా స్టేషన్‌ నుంచి మహాకరణ్‌ స్టేషన్‌ వరకు 520 మీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మించి, అందులో రెండు ట్రాక్‌లు వేశారు. ఇది జంట నగరాలైన కోల్‌కతా, హౌరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.



Next Story

Most Viewed