ఢిల్లీ వైపుగా రైతుల దండు.. 6 నెలలకు సరిపడా రేషన్, డీజిల్‌తో కదిలిన అన్నదాతలు

by Dishanational5 |
ఢిల్లీ వైపుగా రైతుల దండు.. 6 నెలలకు సరిపడా రేషన్, డీజిల్‌తో కదిలిన అన్నదాతలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) చట్టం, 60ఏళ్లు నిండిన రైతులకు ఆర్థిక సాయం సహా పలు డిమాండ్లను పరిష్కరించుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న ఉద్దేశంతో అన్నదాతలు తలపెట్టిన ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమం మంగళవారం తీవ్ర ఉద్రిక్తతల మధ్య మొదలైంది. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన వేలాది మంది రైతులు తరలివచ్చారు. ఉదయం 10గంటలకు పంజాబ్ నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లలో భారీ ర్యాలీని ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ వైపుగా కదులుతున్న ఈ రైతుల దండును అడ్డుకునే క్రమంలో పోలీసులు, అన్నదాతలకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పంజాబ్, హర్యానా మధ్య ఉన్న శంభు సరిహద్దు వద్దకు భారీ సంఖ్యలో వచ్చిన రైతులపై పోలీసులు భాష్పవాయువు, వాటర్ కెనాన్లు ప్రయోగించారు. డ్రోన్ల ద్వారా సైతం టియర్ గ్యాస్‌, స్మోక్ బాంబులను వదిలారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ క్రమంలోనే రైతులను అడ్డుకునేందుకు రోడ్డుకు అడ్డుగా పెట్టిన సిమెంట్ బారియర్స్, టైర్ డిఫ్లేటర్స్(టైర్లను పంక్చర్ చేసే పరికరాలు), ఇసుక బస్తాలను తొలగించేందుకు ప్రయత్నించారు. సిమెంట్ బారియర్లను ట్రాక్టర్లకు కట్టి రోడ్డు పక్కకు ఈడ్చుకెళ్లారు. అక్కడున్న వంతెనను ధ్వంసం చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే భద్రతా బలగాలు అనేకమంది రైతులను శంభు సరిహద్దు ప్రాంతంలోనే దిగ్బంధించాయి. ఈలోగా చీకటి పడటంతో రాత్రి 8గంటల ప్రాంతంలో మార్చ్‌ను బుధవారానికి వాయిదా వేస్తున్నట్టు రైతు సంఘాలు ప్రకటించాయి. ఉదయం తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించాయి. ‘‘తొలి రోజు నిరసనలు ఆపేశాము. బుధవారం ఉదయం నుంచి ఢిల్లీకి చేరుకునేందుకు మళ్లీ ప్రయత్నిస్తాం’’ అని ఓ రైతు నాయకుడు వెల్లడించారు. రైతు సంఘం నాయకులు జగ్‌జీత్ సింగ్ దల్వాల్, సర్వన్ సింగ్ పథేర్ నేతృత్వంలోని సంయుక్త కిసాన్ మోర్చా, పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సహా ఈ ఆందోళనల్లో 200కు పైగా రైతు సంఘాలు పాల్గొంటున్నాయి. మంగళవారం దాదాపు లక్ష మంది రైతులు నిరసనల్లో పాల్గొన్నట్టు అంచనా.

సుదీర్ఘ నిరసనలకు ప్రణాళిక!

ఛలో ఢిల్లీకి వెళ్తున్న రైతులు అవసరమైతే నెలల తరబడి నిరసనలు చేసేందుకూ సన్నద్ధమయ్యారు. ఈ క్రమంలోనే 6 నెలలకు సరిపోయేంత రేషన్, డీజిల్‌తో నిరసనల్లోకి దిగారు. మంగళవారం నాటి మార్చ్‌ల్లో పాల్గొన్న ట్రాక్టర్లలో భారీ బియ్యం, గోధుమ పిండి, ఇతర ఆహార పదార్థాలతోపాటు డీజిల్‌ క్యాన్లు సైతం కనిపించాయి. 2020లోనే సాగు చట్టాలను రద్దు చేయాలంటూ 13 నెలలపాటు ఢిల్లీ సరిహద్దు వద్ద ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ఎన్నిరోజులైనా తమ డిమాండ్లు నెరవేర్చేవరకు నిరసన కొనసాగిస్తామని చెబుతున్నారు. సూది నుంచి సుత్తి వరకు, రాళ్లను పగులగొట్టే పనిముట్లు సహా తమ ట్రాలీల్లో కావల్సినవన్నీ ఉన్నాయన్నారు. తమ డిమాండ్లన్నీ నెరవేర్చిన తర్వాతే నిరసన విరమిస్తామన్నారు. పంటలన్నింటికీ ‘కనీస మద్దతు ధర’ హామీ ఇచ్చే చట్టాన్ని రూపొందించడం, రైతు రుణమాఫీ, గత ఆందోళనల్లో రైతుల పెట్టిన కేసుల కొట్టివేత వంటి డిమాండ్లన్నీ నెరవేరేదాకా తిరిగి గ్రామాలకు వెళ్లబోమని స్పష్టం చేశారు.

‘అమృత్‌కాల్’ అంటే ఇదేనా?: ప్రతిపక్షాలు

రైతు ఆందోళనలను అడ్డుకుంటున్న కేంద్రంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. మోడీ ప్రభుత్వం రైతుల గొంతు నొక్కుతోందని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆరోపించారు. 10 ఏళ్లుగా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ సర్కార్ విఫలమైందని విమర్శించారు. మరోవైపు, రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. ప్రధాని మోడీ చెబుతున్న ‘అమృత్ కాల్’ అంటే ఇదేనా అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. రైతులను అణచివేసే బదులు, వారి డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తే బాగుంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రైతులకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. ‘రైతుల కవాతును నియంత్రించడానికి టియర్ గ్యాస్ ప్రయోగించడం, సరిహద్దుల్లో బారీకేడ్లు ఏర్పాటు చేయడం వంటివి చేస్తున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, పంట రేటు, ఎంఎస్‌పీ అమలు చేస్తామని వాగ్దానం చేసిన ప్రభుత్వంమే ఇలాంటి చర్యలకు పాల్పడటం ఆశ్యర్యం కలిగిస్తోంది’ సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ విమర్శించారు.

అధికారంలోకి రాగానే ఎంఎస్పీ..: రాహుల్ గాంధీ

రైతుల నిరసనల మధ్య కాంగ్రెస్ పార్టీ కీలక ప్రకటన చేసింది. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే వివిధ పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు రాహుల్ గాంధీ ఎక్స్‌లో స్పందించారు. ‘రైతు సోదరులారా, ఇది చారిత్రాత్మకమైన రోజు. స్వామినాథన్ కమిషన్ ప్రకారం, పంటలపై ప్రతి రైతుకు కనీస మద్దతు ధర విషయంలో చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ నిర్ణయంతో 15 కోట్ల రైతు కుటుంబాలకు భరోసా లభిస్తుంది. ఇది రైతులకు న్యాయం చేకూర్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న మొదటి హామీ’ అని పోస్ట్ చేశారు.

హడావుడిగా ఎంఎస్పీ తేలేం: కేంద్రం

రైతుల నిరసనపై కేంద్రమంత్రి అర్జున్ ముండా స్పందిస్తూ, ‘కొన్ని శక్తులు (విపక్షాలను ఉద్దేశిస్తూ) వారి రాజకీయ ప్రయోజనాల కోసం రైతుల ఆందోళనను ఉపయోగించుకుంటున్నాయి. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)పై హడావుడిగా చట్టాన్ని తీసుకురాలేం. దీనిపై అన్ని వర్గాలతో సుదీర్ఘ సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. రైతు సంఘాలు ఆందోళన విరమించి ప్రభుత్వంతో చర్చలు జరపాలి’ అని తెలిపారు. కాగా, ఆందోళనల అంశంపై కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, అర్జున్‌ ముండా నేతృత్వంలోని ప్రభుత్వ బృందం.. రైతు సంఘాలతో సోమవారం ఐదు గంటలపాటు సుదీర్ఘంగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. రైతులపై కేసులు కొట్టేసేందుకు అంగీకారం తెలపగా, ఎంఎస్‌పీకి చట్టబద్ధతపై ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో మరుసటి రోజైన మంగళవారం రైతులు ఆందోళనకు దిగారు.



Next Story