సర్పంచ్ టూ సీఎం..ఒడిశా నూతన ముఖ్యమంత్రి నేపథ్యమిదే?

by vinod kumar |
సర్పంచ్ టూ సీఎం..ఒడిశా నూతన ముఖ్యమంత్రి నేపథ్యమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశా కొత్త సీఎం ఎవరనే విషయంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గిరిజన సామాజిక వర్గానికి చెందిన మోహన్ చరణ్ మాఝీని బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రిగా ప్రకటించింది. భువనేశ్వర్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో మంగళవారం జరిగిన సమావేశంలో మాఝీని బీజేపీ శాసన సభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. సీఎం ఎంపికపై పార్టీ నియమించిన కేంద్ర పరిశీలకులు రాజ్‌నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్‌లు కూడా ఈ మీటింగ్‌కు హాజరయ్యారు. సమావేశం అనంతరం రాజ్ నాథ్ అధికారికంగా మాఝీ పేరును ప్రకటించారు. దీంతో ఒడిశా 15వ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. అలాగే కేవీ సింగ్‌దేవ్, ప్రభాతి పరిదాలు డిప్యూటీ సీఎంలుగా ఎన్నికయ్యారు.

మాఝీ నేపథ్యం..

బీజేపీ సీనియర్ నేత అయిన మోహన్ చరణ్ మాఝీ1972 జనవరి 6న జన్మించారు. గిరిజన ప్రాంతాల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేతగా ఉన్నారు. ఇప్పటి వరకు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2000, 2009, 2019లో శాసన సభ్యునిగా గెలిచారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ కియోంజర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన మాఝీ బీజేడీకి చెందిన వీణా మాఝీపై 11 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అంతేగాక మాఝీ ఎమ్మెల్యేగా ఎన్నికవ్వక ముందు సర్పంచ్‌గా విధులు నిర్వహించారు. 1997 నుంచి 2000 వరకు సర్పంచ్‌గా పనిచేశారు. మోహన్ మాఝీ ప్రజా సేవ, సంస్థాగత నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందారు. 2005 నుంచి 2009 వరకు బిజూ జనతాదళ్ (బీజేడీ), బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ చీఫ్ విప్‌గా ఉన్నారు. 2023లో స్పీకర్ పై ఉడకని పప్పును విసిరేసిందుకు ఆయనను సభ నుంచి సస్పెండ్ చేశారు.

12న ప్రమాణస్వీకారం!

నూతన సీఎంగా ఎన్నికైన మాఝీ బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. భువనేశ్వర్‌లోని జనతా మైదాన్‌లో సాయంత్రం 5గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ 12 న మధ్యాహ్నం 1 గంట తర్వాత భువనేశ్వర్‌లోని అన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులకు సగం రోజు సెలవు ఇచ్చారు.కాగా, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 147 స్థానాలకు గాను బీజేపీ 78, బీజేడీ 51, కాంగ్రెస్ 14, ఇతరులు నాలుగు స్థానాల్లో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే ఒడిశాలో మొదటి బీజేపీ ప్రభుత్వం కావడం గమనార్హం.



Next Story

Most Viewed