దేశీయ స్టార్టప్‌ల నుంచి కొనుగోళ్లకు కేటాయింపులు ఆశిస్తున్న రక్షణ రంగం!

by Disha Web Desk 17 |
దేశీయ స్టార్టప్‌ల నుంచి కొనుగోళ్లకు కేటాయింపులు ఆశిస్తున్న రక్షణ రంగం!
X

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న 2023-24 బడ్జెట్‌లో రక్షణ రంగం భారీ అంచనాలను కలిగి ఉంది. ఈ రంగంలో తయారీని ప్రోత్సహించేందుకు పథకాలు, నిర్ణయాలు ఉంటాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. గత కొన్నేళ్లలో కేంద్రం రక్షణ రంగంలో తయారీని ప్రోత్సహించడానికి దిగుమతులు తగ్గించింది. దీనివల్ల 2016-17లో భారత రక్షణ రంగ ఎగుమతులు రూ. 1,521 కోట్ల నుంచి 2021-22 నాటికి రూ. 12,815 కోట్లకు పెరిగాయి.

అలాగే, సాయుధ దళాల దిగుమతులపై మూలధన వ్యయాన్ని 2019-20లో 41.89 శాతం నుంచి 2020-21లో 36 శాతానికి తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఈ రంగానికి ప్రభుత్వం రూ. 5.25 లక్షల కోట్లను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశీయ రక్షణ రంగంలోని స్టార్టప్‌ల నుంచి లభించే వినూత్న ఉత్పత్తులను కొనేందుకు రానున్న బడ్జెట్‌లో కేటాయింపులు పెరగాలని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

అదే సమయంలో పన్ను మినహాయింపులు, జీఎస్టీ తగ్గింపు వంటి నిర్ణయాల ద్వారా ఈ రంగంలో కొత్త పెట్టుబడులకు అవకాశం, స్థానిక కొనుగోళ్ల ద్వారా దేశీయ పరిశ్రమ వృద్ధికి అవకాశం లభిస్తుందని పరిశ్రమ భావిస్తోంది.


Next Story

Most Viewed