మావోయిస్టు రహిత దేశంగా మారుస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా

by Dishanational2 |
మావోయిస్టు రహిత దేశంగా మారుస్తాం: కేంద్ర హోం మంత్రి అమిత్ షా
X

దిశ, నేషనల్ బ్యూరో: ఛత్తీస్‌గఢ్‌తో పాటు దేశం మొత్తాన్ని మావోయిస్టుల నుంచి విముక్తి చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మావోయిస్టులు అభివృద్ధికి అతిపెద్ద శత్రువుల్లా తయారయ్యారని ఆరోపించారు. ఛత్తీస్ గఢ్‌లో 29 మంది మావోయిస్టులను ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో భద్రతా బలగాలు గొప్ప విజయాన్ని సాధించాయన్నారు. మోడీ ప్రధాని అయినప్పటి నుంచి నక్సలిజం, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిరంతరం ప్రచారం ప్రారంభించామని తెలిపారు. మావోయిస్టులను అరికట్టేందుకు చత్తీస్‌గఢ్‌లో ఇప్పటికే 250 శిబిరాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు.

రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల కాలంలోనే ఛత్తీస్‌గఢ్‌లో 80 మందికి పైగా నక్సలైట్లు హతమయ్యారని గుర్తు చేశారు. మరో 125 మందికి పైగా అరెస్టవ్వగా..150 మందికి పైగా నక్సలైట్లు లొంగిపోయారని తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వ విధానాల వల్ల మావోయిస్టులు ఇప్పుడు చిన్న ప్రాంతానికి పరిమితమయ్యారన్నారు. త్వరలోనే ఛత్తీస్‌గఢ్‌తో పాటు దేశమంతా నక్సల్స్ రహితంగా మారుతుందని స్పష్టం చేశారు. కాగా, భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య మంగళవారం జరిగిన కాల్పుల్లో 29 మంది నక్సలైట్లు మరణించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed