Karnataka: కర్ణాటకలో పాలస్తీనా అనుకూల బ్యానర్ కలకలం.. బీజేపీ ఫైర్

by Shamantha N |
Karnataka: కర్ణాటకలో పాలస్తీనా అనుకూల బ్యానర్ కలకలం.. బీజేపీ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలోని శివమొగ్గలో పాలస్తీనా అనుకూల బ్యానర్‌ కలకలం రేపింది. “వి స్టాండ్ విత్ పాలస్తీనా” అని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బ్యానర్ ఏర్పాటు చేశారు. దీనిపై, కర్ణాటక బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ హోంమంత్రి, బీజేపీ నేత అరగ జ్ఞానేంద్ర (Araga Jnanendra) అధికారులకు ఫిర్యాదు చేశారు. బ్యానర్‌ను వెంటనే తొలగించాలని కోరారు. బ్యానర్ తొలగించాలని జిల్లా అధికారులకు లేఖ రాశారు. ఈద్‌ ఊరేగింపు సందర్భంగా బ్యానర్‌ను ఏర్పాటు చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల మతసామరస్యం దెబ్బతింటుందని ఆరోపించారు.

దేశ సమైక్యతకు విరుద్ధం

దేశ సమైక్యతకు విరుద్ధమైన ఇలాంటి బ్యానర్లు మన సమాజంలో అనైక్యతకు బీజం వేస్తాయని అరగ జ్ఞానేంద్ర అన్నారు. గతంలో జరిగిన మంగళూరు కుక్కర్‌ పేలుడు కేసు, బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో పేలుడు ఘటనల్లో స్థానికుల ప్రమేయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. వాటి వల్ల తీర్థహళ్లిలో ఎదురైన ఉద్రిక్తల గురించి చెప్పుకొచ్చారు. ఇప్పటికే జరిగిన కొన్ని ఘటనలతో ప్రజలు భయాందోళనలో ఉన్నారన్న అరగ జ్ఞానేంద్ర.. ఈ బ్యానర్ వల్ల ఉద్రిక్తతలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ నేత లేఖపై స్పందించిన పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. బ్యానర్‌ను తొలగించి గుర్తు తెలియని వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బ్యానర్ ని తొలగించామని ఘటనపై దర్యాప్తు జరుగుతోందన్నారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story