- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఈవీఎంలపై ఈసీకి సుప్రీంకోర్టు కీలక ప్రశ్నలు
దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికల ప్రక్రియను నియంత్రించే అధికారం తమకు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రాజ్యాంగ సంస్థ అయిన కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) పనితీరును తాము నిర్దేశించలేమని తేల్చి చెప్పింది. ఓట్ల లెక్కింపు టైంలో ఈవీఎం ఓట్లతో 100 శాతం అన్ని వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించాలంటూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. బుధవారమే తీర్పును ధర్మాసనం వెలువరించాల్సి ఉండగా.. పిటిషనర్లకు కొన్ని సందేహాలు ఉండటంతో వాటిపై ఈసీని వివరణ కోరింది. ఈక్రమంలో ఈసీకి కొన్ని ప్రశ్నలు సంధించింది.
ఈవీఎంలో మైక్రో కంట్రోలర్ ఎక్కడ ఉంటుంది ?
‘‘ఈవీఎంలో మైక్రో కంట్రోలర్ ఎక్కడ ఉంటుంది. కంట్రోలింగ్ యూనిట్‌లోనా లేదా వీవీప్యాట్‌లోనా?’’ అని ఈసీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మైక్రో కంట్రోలర్ అనేది ఒకసారి రూపొందించిన ప్రోగ్రామా, కాదా ? అనేది నిర్ధారించాలని ఈసీకి దేశ సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. కోర్టు ఆదేశాల మేరకు బుధవారం మధ్యాహ్నం ఈసీ అధికారులు న్యాయస్థానం ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. సందేహాలపై వివరణతో కూడిన డాక్యుమెంట్లను ఈసీ అధికారులు సుప్రీంకోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం ప్రతీ అసెంబ్లీ స్థానం పరిధిలోని 5 ఈవీఎంలలోని ఓట్లను వీవీప్యాట్ స్లిప్పులతో వేరిఫై చేస్తున్నారు. అలా కాకుండా మొత్తం వీవీప్యాట్ స్లిప్పులను సరిపోల్చడం సులభం కాదని ఈసీ వాదిస్తోంది. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే అవకాశమే లేదని అంటోంది.
పిటిషనర్ల అనుమానాల ఆధారంగా ఉత్తర్వులు ఇవ్వలేం
బుధవారం రోజు విచారణ సందర్భంగా ఈవీఎం సోర్స్ కోడ్‌కు సంబంధించిన అంశాలను పిటిషనర్లు లేవనెత్తారు. పారదర్శకత కోసం దాన్ని బయటపెట్టాలని కోరారు. అయితే దీన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యతిరేకించింది. ‘‘సోర్స్ కోడ్‌ను ఎప్పుడూ బహిర్గతం చేయకూడదు. అలా చేస్తే దాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంటుంది’’ అని వ్యాఖ్యానించింది. తమ సందేహాలను ఈసీ నివృత్తి చేసిందని కోర్టు వెల్లడించింది. పిటిషనర్ల ఆలోచనా ధోరణిని తాము మార్చలేమని, అనుమానాలను ఆధారంగా చేసుకుని ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ‘‘ఎన్నికల సంఘం ఓ రాజ్యాంగ సంస్థ, దాని పనితీరును మేం నిర్దేశించలేం. ఎన్నికల ప్రక్రియను నియంత్రించలేం’’ అని సుప్రీంకోర్టు బెంచ్ పేర్కొంది. ఈసీ వివరణను, పిటిషనర్ల సందేహాలను విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసినట్లు ప్రకటించింది.