- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
టన్నెల్‌లో చిక్కుకున్న కార్మికులకు పౌష్టికాహారం, ఫోన్లు

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా టన్నెల్‌లో 41 మంది కార్మికులు చిక్కుకొని సోమవారంతో తొమ్మిది రోజులు గడిచాయి. కార్మికులు ఇంకా బయటికి రాకపోయినప్పటికీ.. వారి భవితవ్యంపై ఆశలు రేకెత్తించే కొన్ని పరిణామాలు తాజాగా చోటుచేసుకున్నాయి. సొరంగంలో కార్మికులు చిక్కుకున్న భాగం వైపుగా 6 అంగుళాల వెడల్పు గల మరో పైపును చొప్పించారు. ఆ పైపు ద్వారా కార్మికులకు ప్లాస్టిక్ బాటిళ్లలో పౌష్టికాహారాన్ని పంపిస్తామని రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్న అధికారులు వెల్లడించారు.
కార్మికులు తమ కుటుంబీకులతో మాట్లాడుకునేందుకుగానూ ఛార్జర్‌తో కూడిన ఫోన్‌ను పంపుతామని తెలిపారు. సోమవారం వారికి ఈ పైపు ద్వారా మూంగ్ కిచిడీని పంపించారు. మరోవైపు అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుల బృందం సోమవారం ఘటనాస్థలిని పరిశీలించింది. కార్మికులందరినీ సొరంగం నుంచి సురక్షితంగా బయటకు తీస్తామని ఇంటర్నేషనల్ టన్నెలింగ్ అండ్ అండర్‌గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ డిక్స్ ఈ సందర్భంగా వెల్లడించారు.
రంగంలోకి ఓఎన్జీసీ, ఆర్మీ, డీఆర్డీఓ
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) డ్రిల్లింగ్ హెడ్ కూడా టన్నెల్‌ను సందర్శించారు. అడ్డంగా డ్రిల్లింగ్ ఆలస్యం అవుతున్నందున.. ఓఎన్జీసీకి చెందిన నిపుణులు సిల్క్యారా సొరంగంలోకి నిలువులో కూడా డ్రిల్లింగ్ పనిని మొదలుపెట్టారు. నిలువు డ్రిల్లింగ్ నవంబర్ 26 (ఆదివారం) నాటికి పూర్తి కానుంది.భారత సైన్యానికి చెందిన ఒక డ్రోన్ ఆకాశం నుంచి పనులను పర్యవేక్షిస్తూ సొరంగం నిలువు డ్రిల్లింగ్‌కు సరైన గైడెన్స్ ఇస్తోంది.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ)కు చెందిన రోబోటిక్స్ బృందం సొరంగం ప్రదేశానికి చేరుకుంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిపై ఆరా తీసేందుకు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీకి ఫోన్ చేశారు. కార్మికులను రక్షించేందుకు జరుగుతున్న సహాయక చర్యల గురించి ప్రధానికి సీఎం వివరించారు. సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులు మనోధైర్యం కోల్పోకుండా చూడాలని సీఎంకు ప్రధానమంత్రి సూచించారు.