దళిత మహిళను తాకారంటే నమ్మశక్యంగా లేదు..

by Dishanational4 |
దళిత మహిళను తాకారంటే నమ్మశక్యంగా లేదు..
X

కోజికోడ్: కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న సామాజిక కార్యకర్త చంద్రన్‌కి కేరళ న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. దళిత మహిళ షెడ్యూల్డ్ క్యాస్ట్‌కి చెందిన వ్యక్తి అని ముందే తెలిసివున్న చంద్రన్ ఆమెను తాకి ఉంటాడంటే నమ్మశక్యంగా లేదని కొజికోడ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ కృష్ణ కుమార్ వ్యాఖ్యానిస్తూ ఆగస్టు 2న చంద్రన్‌కు బెయిల్ మంజూరు చేశారు. ఆనాటి తీర్పుపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ న్యాయమూర్తి, చంద్రన్ కేసులో మరో ఘటనలో కూడా విమర్శలు ఎదుర్కోవడం గమనార్హం. అసభ్యకరమైన దుస్తులు ధరించే మహిళలు వేసే లైంగిక వేధింపుల కేసులు నిలబడవని ఆగస్టు 2న పేర్కొన్న జడ్జి ఆగస్టు 12వ మరో వివాదాస్పద ఉత్తర్వు జారీ చేసిన విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతున్న నిందితుడికి ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టం వర్తించదని తీర్పు చెప్పారు.

అటు లైంగిక వేధింపుల కేసులోనూ, ఈ ఎస్సీ ఎస్టీ చట్టం కేసులోనూ నిందితుడు 74 ఏళ్ల సివిక్ చంద్రనే కావడం విశేషం. వివరాల్లోకి వెళితే రచయిత, ఉద్యమకారుడు అయిన చంద్రన్ తమను లైంగికంగా వేధించారని ఇద్దరు మహిళలు ఫిర్యాదు చేశారు. ఒక మహిళ ఎస్సీఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేస్తే, మరో మహిళ లైంగిక వేధింపుల చట్టం కింద ఫిర్యాదు చేశారు. అయితే ఈ రెండు కేసుల్లోనూ సంబంధిత చట్టాలు నిందితుడు చంద్రన్‌కు వర్తించవని తీర్పు ఇచ్చిన జస్టిస్ ఎస్ కృష్ణ కుమార్ ఆగస్టు 2, 12వ తేదీల్లో బెయిల్ మంజూరు చేశారు. నిందితుడు చంద్రన్ తన కులం పేరు కూడా రాసుకోవడానికి ఇష్టపడటం లేదని, ఆయన ప్రధానంగా సంస్కర్త అని, కుల వ్యవస్థపై పోరాడుతున్నారని న్యాయమూర్తి చెప్పారు. కులరహిత సమాజం కోసం రచనలు చేస్తున్న వ్యక్తి, ఎస్సీ మహిళ శరీరాన్ని దురుద్దేశంతో తాకి ఉంటాడంటే నమ్మశక్యంగా లేదని జస్టిస్ కృష్ణన్ కుమార్ పేర్కొంటూ తనకు బెయిల్ మంజూరు చేశారు.


Next Story