యూనివర్సిటీల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు: యూజీసీ

by Gopi |
యూనివర్సిటీల్లో ఏడాదికి రెండుసార్లు అడ్మిషన్లు: యూజీసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: యూజీసీ విదేశీ విశ్వవిద్యాలయాల తరహాలో భారతీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు ఏటా రెండుసార్లు అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఈ మేరకు యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) చీఫ్ జగదీష్ కుమార్ అనుమతులు ఇస్తున్నట్టు తెలిపారు. 2024-25 అకడమిక్ ఇయర్ నుంచి రెండు దశల్లో అంటే జూలై-ఆగష్టు, జనవరి-ఫిబ్రవరి నెలల్లో అడ్మిషన్లు నిర్వహించేలా అనుమతులిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. 'దేశీయ యూనివర్శిటీల్లో ఏటా రెండుసార్లు అడ్మిషన్లు కల్పించడం ద్వారా విద్యార్థులకు ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా బోర్డు ఫలితాల్లో వివిధ కారణాలతో జూలై-ఆగష్టులో అడ్మిషన్ తీసుకోలేకపోయిన వారికి ఈ నిర్ణయం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా రెండుసార్లు అడ్మిషన్ ప్రక్రియ ద్వారా విద్యార్థులకు ఏడాది సమయం వృధా కాకుండా ఉంటుంది. మరోవైపు కంపెనీలు సైతం క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లను రెండుసార్లు నిర్వహించవచ్చని' జగదీష్ వివరించారు. రెండుసార్లు అడ్మిషన్ల ద్వారా విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు తమ ఫ్యాకల్టీ, క్లాస్‌రూమ్, ల్యాబ్, ఇతర సౌకర్యాలను మరింత సమర్థవంతంగా కలిగి ఉండొచ్చు. విదేశీ యూనివర్శీటీల్లో ఈ విధానం ఇప్పటినే ఉన్నందున అంతర్జాతీయ సంస్థలతో కలిసి పనిచేయడానికి వీలవుతుంది. అయితే, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్శిటీలు ఈ విధానం పాటించాల్సిన అవసరం లేదు. ఇది తప్పనిసరి కాదు. మెరుగైన మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ ఉన్న విద్యా సంస్థలు దీన్ని ఉపయోగించవచ్చని జగదీష్ కుమార్ వెల్లడించారు.

Next Story

Most Viewed