Uddhav Thackeray: దేశంలో ‘గోద్రా’ తరహా అల్లర్లకు కుట్ర.. ఉద్ధవ్ థాక్రే సంచలన ఆరోపణలు

by Vinod kumar |
Uddhav Thackeray: దేశంలో ‘గోద్రా’ తరహా అల్లర్లకు కుట్ర.. ఉద్ధవ్ థాక్రే సంచలన ఆరోపణలు
X

ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో మరోసారి ‘గోద్రా’ తరహా అల్లర్లు సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని వ్యాఖ్యానించారు. అయోద్య రామమందిరం ప్రారంభం అయిన తర్వాత ఆ రాముడి పేరుతో హింసాకాండకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. జలగావ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఉద్ధవ్ పాల్గొని మాట్లాడారు. ‘లోక్‌సభ ఎన్నికలకు ముందు(జనవరిలో) రామమందిరం ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవానికి దేశం నలుమూలల నుంచి బస్సులు, రైళ్లలో హిందువులను పిలిపించే అవకాశం ఉంది. వారు తిరిగి వెళ్లేదారిలో ఎక్కడో ఒకచోట గోద్రా తరహా ఘటన జరిగొచ్చు. వారిపై దాడిచేయొచ్చు. బస్సులు తగలబెడతారు. రాళ్లు రువ్వుతారు. నరమేధం సృష్టిస్తారు. దీంతో దేశం మళ్లీ మండిపోతుంది.

ఈ మంటలపై వాళ్లు రాజకీయ రొట్టెలు కాల్చుకుంటారు’ అని ఏ పార్టీ పేరు ప్రస్థావించడకుండానే వ్యాఖ్యానించారు. అయితే, ఉద్ధవ్ ఆరోపణలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, బీజేపీ పాలిత గోవా సీఎం ప్రమోద్ సావంత్ మండిపడ్డారు. ‘ఇండియా’ కూటమి ఓట్ల కోసం ఎంతకైనా తెగిస్తారని తెలిపారు. ఆ కూటమికి జ్ఞానం ప్రసాదించాల్సిందిగా రాముడిని ప్రార్థించాలని కోరుతున్నానని కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఎద్దేవా చేశారు. కాగా, 2002లో గుజరాత్‌లోని గోద్రా రైల్వే స్టేషన్‌లోని సబర్మతి ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని కోచ్‌లకు నిప్పంటించడంతో 58మంది చనిపోయిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed