'ఎన్నికల కోడ్ నుంచి బీజేపీకి మినహాయింపా?'.. అమిత్‌షా హామీ‌పై ఉద్ధవ్ థాక్రే ఫైర్

by Vinod kumar |
ఎన్నికల కోడ్ నుంచి బీజేపీకి మినహాయింపా?.. అమిత్‌షా హామీ‌పై ఉద్ధవ్ థాక్రే ఫైర్
X

ముంబై : మధ్యప్రదేశ్‌లో బీజేపీ గెలిస్తే రాష్ట్ర ప్రజల అయోధ్య సందర్శనకు ఏర్పాట్లు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన హామీపై శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఎన్నికల కోడ్‌లో ఏమైనా మార్పులు చేశారా అని ఈసీని ప్రశ్నించారు. బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ ఎన్నికల సంఘం ద్వంద్వ ప్రమాణాలను పాటిస్తోందని ఆరోపించారు. గురువారం ముంబైలో విలేకరుల సమావేశంలో ఉద్ధవ్ థాక్రే మాట్లాడారు. ‘‘1987లో మహారాష్ట్రలోని విలేపార్లే అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో హిందుత్వమే ప్రధాన అంశంగా మారింది.

ఆనాడు శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే ఓటుహక్కును ఎన్నికల సంఘం రద్దు చేసింది. మరి ఇప్పుడు ఎన్నికల కోడ్‌ను సడలించారా? అదే నిజమైతే.. ఆ విషయాన్ని మీ(ఈసీ) ద్వారా తెలుసుకోవాలని భావిస్తున్నాం’’’ అని ఆయన లేఖలో ప్రస్తావించారు. బీజేపీకి ‘ఫ్రీ హిట్’ ఛాన్స్ ఇస్తూ.. ఇతర పార్టీల యాక్టివిటీని ‘హిట్ వికెట్’‌గా పరిగణిస్తున్నట్టు ఈసీ ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటుండటం సరికాదన్నారు. మే నెలలో కర్ణాటక‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఓటు వేసేటప్పుడు జై బజరంగబలి అని చెప్పాలని ఓటర్లకు ప్రధాని మోడీ సూచించిన విషయాన్ని ఉద్ధవ్ థాక్రే తన లేఖలో పొందుపరిచారు.

Next Story

Most Viewed