అయోధ్యకు వెళ్లేందుకు నాకు ఆహ్వానం అక్కర్లేదు: ఉద్ధవ్

by Harish |
అయోధ్యకు వెళ్లేందుకు నాకు ఆహ్వానం అక్కర్లేదు: ఉద్ధవ్
X

ముంబై: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించకపోవడంపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాక్రే ఘాటుగా స్పందించారు. ‘‘నాకు ఆహ్వానం అందలేదు.. అవేమీ నాకు అక్కర్లేదు.. రాముడు నావాడు కూడా. నేను కావాలనుకుంటే ఎప్పుడైనా అయోధ్యకు వెళ్లి శ్రీరాముడిని దర్శించుకుంటాను’’ అని ఆయన పేర్కొన్నారు. తాను సీఎం అయ్యాక కూడా అయోధ్య దర్శనానికి వెళ్లొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. జనవరి 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాజకీయం చేయొద్దని అందరికీ ఉద్ధవ్ విజ్ఞప్తి చేశారు.

కరసేవలో పాల్గొని చాలాసార్లు జైలుకు వెళ్లొచ్చానని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘బాబ్రీ మసీదును ఆనాడు కూల్చివేసిన వాళ్ల పేర్లు ఈరోజు ఎక్కడా వినిపించడం లేదు. వారిలో అతికొద్దిమంది పేర్లే వినిపిస్తున్నాయి. ఆ టైంలో కొంతమంది నాయకులు స్కూల్ పిక్నిక్‌కు వెళ్లే వయసులో ఉండి ఉంటారు’’ అని ఎద్దేవా చేశారు. కాగా, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరేను అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం గమనార్హం.

Next Story

Most Viewed