స్పేస్ స్టేషన్ లో ‘స్పేస్ బగ్’.. సునితా విలియమ్స్ కు ఇబ్బందులు

by Shamantha N |
స్పేస్ స్టేషన్ లో ‘స్పేస్ బగ్’.. సునితా విలియమ్స్ కు ఇబ్బందులు
X

దిశ, నేషనల్ బ్యూరో: అంత‌రిక్ష కేంద్రంలో ఉన్న భార‌తీయ సంత‌తి వ్యోమ‌గామి సునీతా విలియ‌మ్స్‌తో పాటు మ‌రో 8 మంది ఆస్ట్రోనాట్స్ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్ లైనర్ వ్యోమనౌకలో ఈ ఆస్ట్రోనాట్స్ స్పేస్ స్టేషన్ వెళ్లారు. కాగా.. స్పేస్ స్టేష‌న్‌లో స్పేస్‌బ‌గ్ ఎంటరైంది. ఎంటిరోబ్యాక్ట‌ర్ బుగండెన్సిస్ బ్యాక్టీరియా అంత‌రిక్ష కేంద్రంలో ఉన్న‌ట్లు సైంటిస్టులు గుర్తించారు. ఆ జీవి మ‌ల్టీ డ్ర‌గ్ రెసిస్టెంట్ అని తేల్చారు. స్పేస్ స్టేష‌న్ వాతావ‌ర‌ణాన్ని ఆ బ్యాక్టీరియా త‌ట్టుకుంటోంద‌న్నారు. మ‌ల్టీ డ్ర‌గ్ రెసిస్టెంట్ కావ‌డం వ‌ల్లే దాన్ని సూప‌ర్‌బ‌గ్ అని పిలుస్తున్నట్లు నాసా తెలిపింది. ఈ బ్యాక్టీరియా వ్యోమ‌గాముల ఊపిరితిత్తుల‌కు సోకే అవ‌కాశం ఉన్న‌ది.

స్పేస్ స్టేషన్ లో సూపర్ బగ్స్

సూప‌ర్‌బ‌గ్స్ ఏలియన్స్ కావని.. అవి వ్యోమ‌గాముల‌తోనే స్పేస్ స్టేష‌న్‌ లోకి ఎంటరైనట్లు నాసా సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఎంటిరోబ్యాక్ట‌ర్ బుగండెన్సిస్‌కు చెందిన 13 ర‌కాల స్ట్రెయిన్స్ స్ట‌డీ చేస్తున్న‌ట్లు నాసా తెలిపింది. అంత‌రిక్ష కేంద్రంలో ఆ బ్యాక్టీరియా ర‌కాలు త‌ట్టుకునే శ‌క్తిని డెవ‌ల‌ప్ చేసుకుంటున్న‌ట్లు గుర్తించారు. ఇత‌ర జీవుల‌తో పాటు ఈ.బుగండెన్సిస్ బ్యాక్టీరియా జీవిస్తోంద‌ని, కొన్ని సంద‌ర్భాల్లో ఇత‌ర జీవులు బ్ర‌తికేందుకు కూడా ఆ బ్యాక్టీరియా ఉప‌యోగ‌ప‌డుతున్న‌ట్లు తెలిపారు. కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొప‌ల్స‌న్ ల్యాబ్‌లో ప‌నిచేస్తున్న డాక్ట‌ర్ క‌స్తూరి వెంక‌టేశ్వ‌ర‌న్ .. స్పేస్ స్టేష‌న్ బ్యాక్టీరియాపై స్టడీ చేస్తున్నారు. నాసాలో జాయిన్ కావ‌డానికి ముందు ఆయ‌న చెన్నైలోని అన్నామ‌ళై వ‌ర్సిటీలో మెరైన్ మైక్రోబ‌యాల‌జీ చేశారు. ఆ స‌మ‌యంలో మ‌ల్టీ డ్ర‌గ్ రెసిస్టెంట్ క‌లేమిలా పియ‌ర్సోనీ బ‌గ్‌ను ఆయ‌న గుర్తించారు. జేపీఎల్‌తో పాటు ఐఐటీ మ‌ద్రాసు.. సంయుక్తంగా బుగండెన్సిస్ బ్యాక్టీరియాపై స్ట‌డీ చేస్తోంది.



Next Story

Most Viewed