పినరయి బాటలోనే సీఎం స్టాలిన్

by Gopi |
పినరయి బాటలోనే సీఎం స్టాలిన్
X

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుకు నోటీఫికేషన్‌ జారీ చేయడంపై తమిళనాడు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు నేతలు దీన్ని అమలు చేయమని చెప్పాయి. కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సైతం ఎట్టిపరిస్థితుల్లో సీఏఏను తమ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన బాటలోనే తమిళనాడు సీఎం స్టాలిన్ సైతం ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. సీఏఏ వల్ల ఎటువంటి ఉపయోగాలు, ప్రయోజనాలు లేవని, అటువంటి చట్టాన్ని తమిళ రాష్ట్రంలో అమలు చేసేది లేదని పేర్కొన్నారు. ఇది పూర్తిగా అసమంజసమైంది. దీనివల్ల భారతీయ ప్రజల్లో విభేదాలు పెరుగుతాయని, ఈ చట్టాన్ని రద్దు చేయాలని' స్టాలిన్ పేర్కొన్నారు. 'సీఏఏ చట్టంలో ఉన్న నిబంధనలు భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి. ఈ చట్టం లౌకికవాదం, మైనారిటీ వర్గాలకు, శ్రీలంక తమిళ శరణార్థులకు వ్యతిరేకంగా ఉంది. అందుకే తాము సీఏఏని అమలు చేసేందుకు అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించాం. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న ఈ సమయంలోనే ఎందుకు కేంద్రం సీఏఏను నోటిఫై చేసింది' అని స్టాలిన్ సందేహం వ్యక్తం చేశారు.

తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటే ఆ రాష్ట్ర ముఖ్యమైన నేతలు కూడా సీఏఏను వ్యతిరేకిస్తూ ప్రకటనలు జారీ చేశారు. అందులో సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ కూడా సీఏఏ చట్టంపై మండిపడ్డారు. 'దేశాన్ని విభజించడానికే కేంద్ర బీజేపీ ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. ఎన్నికలకు ముందు ప్రజలను విడగొట్టి, దేశ సామరస్యాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలవాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల వేళ సీఏఏను హడావుడిగా తీసుకొచ్చిందని' చెప్పారు. ఈ చట్టం రాజ్యాంగం బద్ధమా కాదా అనేది సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. అయితే, కేంద్రం నోటిఫికేషన్ తీసుకొచ్చిన సమయం సందేహం కలిగించేలా ఉంది. సీఏఏ చట్టం మైనారిటీలను రక్షించేందుకే అయితే ఎన్నో కష్టాలను చూసిన శ్రీలంక తమిళులను సీఏఏ పరిధిలోకి ఎంచుకు చేర్చలేదని' కమల్ హాసన్ ప్రశ్నించారు.

మరో తమిళ సినీ నటుడు, కొత్తగా తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించిన దళపతి విజయ్ సైతం సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించారు. ఈ చట్టాన్ని అమలు చేయవద్దని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 'సీఏఏ చట్టం అమలును ఆమోదయోగ్యం కాదు. రాష్ట్రంలో దీన్ని అమలు చేయకూడదని భావిస్తున్నాను. దీనిపై ప్రభుత్వం ప్రజలకు హామీ ఇవ్వాలని' పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే సీఏఏ అమలు కోసం కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడాన్ని కేరళ ప్రభుత్వం, ఢిల్లీలోని ఆప్, టీఎంసీ వ్యతిరేకిస్తున్నాయి. దేశ విభజనకు బీజేపీ కుట్ర చేస్తోందని వారు విమర్శించారు.

Next Story

Most Viewed