భూ ఆక్రమణ వివాదంలో మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్

by S Gopi |
భూ ఆక్రమణ వివాదంలో మాజీ క్రికెటర్, టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల పశ్చిమ బెంగాల్ నుంచి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీగా గెలిచిన భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ వివాదంలో చిక్కుకున్నారు. భూమి ఆక్రమణకు పాల్పడిన ఆరోపణలపై యూసుఫ్ పఠాన్ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ (వీఎంసీ) నోటీసులు జారీ చేసింది. ఆక్రమించిన స్థలం కార్పొరేషన్‌కు చెందినదని, యూసూఫ్ పఠాన్ కబ్జా చేసినట్టు వీఎంసీ నోటీసుల్లో పేర్కొంది. జూన్ 6వ తేదీనే పఠాన్‌కు నోటీసు అందినప్పటికీ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బీజేపీ మాజీ కౌన్సిలర్ విజయ్ పవార్ ఈ విషయాన్ని లేవనెత్తారు. గురువారం మీడియా ప్రకటనలో వడోదర మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ శీతల్ మిస్త్రీ దీనికి సంబంధించిన సమాచారాన్ని అందించారు. ఈ అంశంపై మాట్లాడిన విజయ్ పవార్.. 2012లో యూసుఫ్ పఠాన్‌కు ప్లాట్‌ను విక్రయించాలన్న వీఎంసీ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించినప్పటికీ, యూసుఫ్ పఠాన్ కాంపౌండ్ వాల్ నిర్మించి భూమిని ఆక్రమించారని ఆరోపించారు. ఆ సమయంలో వీఎంసీ ప్రతిపాదనను క్లియర్ చేసి, సాధారణ బోర్డు సమావేశంలో ఆమోదించింది. అయితే, ఇలాంటి విషయాల్లో తుది అధికారం ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని పవార్ పేర్కొన్నారు. కాగా, 2012లో పఠాన్ నిర్మిస్తున్న ఇంటికి ఆనుకుని ఉన్న ప్లాట్‌ను కొనాలని భావించారు. అది వీఎంసీకి చెందినది. దానికోసం చదరపు మీటరుకు రూ. 57 వేలు చెల్లించేందుకు కూడా సిద్ధమయ్యారు. ఆ సమయంలో అందుకు వీఎంసీ కూడా ఆమోదం తెలిపింది.Next Story

Most Viewed