ఇండియా కూటమిని అందుకే విడిచిపెట్టా: నితీశ్ కుమార్ సంచలన ఆరోపణలు

by Dishanational2 |
ఇండియా కూటమిని అందుకే విడిచిపెట్టా: నితీశ్ కుమార్ సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్: ఇటీవల ఇండియా కూటమి నుంచి వైదొలిగి ఎన్డీయేతో చేతులు కలిపిన జనతాదళ్ యునైటెడ్ చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఇండియా కూటమి, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. బిహార్ కులగణన క్రెడిట్ కొట్టేసేందుకు రాహుల్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బుధవారం ఆయన పాట్నాలో మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షాల కూటమికి ‘ఇండియా’ అనే పేరు పెట్టొద్దని కోరినట్టు తెలిపారు. ‘కూటమికి మరో పేరు ఎంచుకోవాలని సూచించా. నేమ్ చేంజ్ చేయాలని ఎంతో ప్రయత్నించా. కానీ ప్రతిపక్ష సభ్యులు నా మాట వినకుండా ఆ పేరునే ఖరారు చేశారు’ అని వ్యాఖ్యానించారు. లోక్‌సభ సీట్ల పంపకాల విషయంలో ఇండియా కూటమి నిర్లక్షం చేసిందని విమర్శించారు. ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో ఇప్పటికీ ఖరారు చేయలేదని చెప్పారు. అందుకే కూటమి నుంచి బయటకు వచ్చినట్టు స్పష్టం చేశారు. బిహార్ ప్రజల కోసం నిరంతరం పని చేస్తూనే ఉంటానని వెల్లడించారు.

రాహుల్ ఆ క్రెడిట్ కొట్టేద్దామనుకున్నారు

బీహార్ కుల గణన సర్వేపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై నితీశ్ స్పందించారు. రాష్ట్రంలో కుల గణన క్రెడిట్ కొట్టేయాలని రాహుల్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కుల గణన ఎప్పుడు జరిగిందో మరిచిపోయారా? 9 పార్టీల సమక్షంలో కులగణన చేశా.. 2019-20లో అసెంబ్లీ మొదలుకొని.. బహిరంగ సభల వరకు అన్ని చోట్లా కుల గణన ప్రస్తావన తీసుకొచ్చా. కానీ వారు ఆ క్రెడిట్ తీసుకుంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. లాలూ ప్రసాద్ యాదవ్ గురించి అడిగిన ప్రశ్నకు నితీశ్ బదులిస్తూ..‘ లాలూపై వచ్చిన ఆరోపణల గురించి అందరికీ తెలుసు. వాటిపై దర్యాప్తు జరుగుతోంది. ఆ కేసుపై నాకు పెద్దగా అవగాహన లేదు. దాని గురించి ఎప్పుడూ లాలూను అడగలేదు’ అని చెప్పారు. మరోవైపు, రాహుల్ గాంధీ బుధవారం బిహార్‌లోని కతిహార్ జిల్లాలో భారత్ జోడో న్యాయ్ యాత్రను తిరిగి ప్రారంభించారు.

Next Story