ఇది మైనారిటీ ప్రభుత్వం.. ఎప్పుడైనా పడిపోవచ్చు!.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
ఇది మైనారిటీ ప్రభుత్వం.. ఎప్పుడైనా పడిపోవచ్చు!.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్డీఏ ప్రభుత్వం పొరపాటున ఏర్పడిందని, మైనారిటీ ప్రభుత్వం ఎప్పుడైనా పడిపోవచ్చని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్టీఏ ప్రభుత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్డీఏ గవర్నమెంట్ పొరపాటున ఏర్పడిందని, మోడీకి వేరే అవకాశం లేదని అన్నారు. అలాగే ఇది మైనారిటీ ప్రభుత్వం. ఎప్పుడైనా పడిపోవచ్చని అన్నారు. కానీ మేము ఈ ప్రభుత్వం ఇలాగే కొనసాగాలి అని, దేశానికి మేలు జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. దేశాన్ని పటిష్టం చేయడానికి మనం కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని, కానీ మన ప్రధాని దేశానికి మంచి జరుగుతుంది అంటే అది జరగనివ్వకుండా చేయడం అలవాటు అని మోడీపై విమర్శలు చేశారు. అయినా మనం పరస్పరం సహకరించుకొని దేశాన్ని పటిష్ట పరుచుకోవాలని ఖర్గే సూచించారు.

కాగా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 241 సీట్లు గెలుచుకొని ఎన్డీఏ పక్షాలతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి 234 సీట్లతో ప్రతిపక్ష హోదాలో ఉంది. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ పక్షాలతో చర్చలు జరిపినట్లు తెగ వార్తలు వచ్చాయి. ఈ నేపధ్యంలోనే ఖర్గే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్డీఏ పక్షాల నేతలతో మరోసారి చర్చలకు సిద్దమయ్యి ఈ తరహా వ్యాఖ్యలు చేశారా? లేక ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని ఎన్డీఏ కూటమిలోని పార్టీలకు హింట్ ఇస్తున్నారా? అనేది రాజకీయ వర్గాల్లో ప్రశ్నార్ధకంగా మారింది.
Next Story

Most Viewed