- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏఐ వచ్చినా ఉద్యోగుల సంఖ్యలో తేడా లేదు.. సర్వేలో సంచలన నిజాలు వెలుగులోకి..
ఏఐతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలను హరిస్తుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తాజా సర్వే ఒకటి వెల్లడించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచవ్యాప్తంగా ఉపాధి రంగంలో పెను మార్పులు తెస్తుందని, లక్షలాది ఉద్యోగాలను హరిస్తుందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. ఏఐ ప్రవేశపెట్టిన తర్వాత కూడా తమ సంస్థల్లో ఉద్యోగుల సంఖ్యలో ఎలాంటి మార్పు రాలేదని సర్వేలో 90 శాతం కంపెనీలు స్పష్టం చేశాయి. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ (NBER) ఇటీవల అమెరికా, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల్లోని సుమారు 6000 మంది ఎగ్జిక్యూటివ్‌లపై నిర్వహించిన సర్వేలో సంచలన నిజాలు వెలుగుచూశాయి.
భారీ పెట్టుబడులు.. స్వల్ప ఫలితాలు
ఏఐ రంగంలో కంపెనీలు బిలియన్ల కొద్దీ డాలర్లను ఖర్చు చేస్తున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదని ఈ నివేదిక పేర్కొంది. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 70 శాతం ఏఐని వినియోగిస్తున్నప్పటికీ, 80 శాతం కంపెనీలు తమ ఉత్పాదకతలో (Productivity) ఎలాంటి వృద్ధిని చూడలేదని తెలిపాయి. 2025లో ప్రపంచవ్యాప్త వెంచర్ క్యాపిటల్ పెట్టుబడుల్లో 61 శాతం (సుమారు $258.7 బిలియన్లు) ఏఐ స్టార్టప్‌లకే దక్కడం విశేషం. ఇంత భారీ పెట్టుబడులు పెట్టినప్పటికీ, తక్షణ లాభాలు మాత్రం కనిపించడం లేదు. కంపెనీల అగ్ర నాయకత్వంలో ఏఐ వినియోగంపై కూడా సర్వే విస్మయం కలిగించే విషయాలను వెల్లడించింది. ‘సర్వేలో పాల్గొన్న లీడర్లలో కేవలం మూడింట ఒక శాతం మంది మాత్రమే ఏఐని వాడుతున్నారు. వారు కూడా వారానికి సగటున కేవలం 90 నిమిషాలు మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నారు. పావు వంతు మంది ఎగ్జిక్యూటివ్‌లు అసలు ఏఐని తాకడం కూడా లేదు’ లేదని నివేదకలో పేర్కొంది. ప్రస్తుతానికి ఫలితాలు నార్మల్‌గా ఉన్నప్పటికీ, రాబోయే మూడేళ్లలో పరిస్థితి మారుతుందని కంపెనీలు ఆశిస్తున్నాయి. భవిష్యత్తులో ఏఐ వల్ల ఉత్పాదకత 1.4 శాతం పెరుగుతుందని, ఉత్పత్తి (Output) 0.8 శాతం పెరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. అదే సమయంలో ఉద్యోగుల సంఖ్యలో 0.7 శాతం స్వల్ప తగ్గింపు ఉండవచ్చని భావిస్తున్నారు.
గతంలో కంప్యూటర్ల రాకతో ఇదే పరిస్థితి
గతంలో 1970-80ల మధ్య కాలంలో కంప్యూటర్ల రాకతో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీనిని ఆర్థికవేత్తలు 'సోలో ఉత్పాదకత పారడాక్స్' (Solow’s productivity paradox) అని పిలుస్తారు. అప్పట్లో కంప్యూటర్ల వల్ల పనిభారం పెరిగి ఉత్పాదకత తగ్గిందని టెక్ నిపుణులు తెలిపారు. మళ్లీ 1990ల చివరలో కానీ సానుకూల ఫలితాలు రాలేదు.. ఇప్పుడు ఏఐ విషయంలోనూ అదే పునరావృతం అవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.






