రూ.2వేల నోటు రద్దుపై స్టాలిన్ విమర్శలు

by sudharani |
రూ.2వేల నోటు రద్దుపై స్టాలిన్ విమర్శలు
X

చెన్నయ్: రూ.2 వేల నోటును రద్దు చేస్తూ భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు విమర్శలు కురిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ స్పందిస్తూ, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమిని కప్పిపుచ్చుకునేందుకే కేంద్రం రూ.2వేల నోటును రద్దు చేసిందని స్టాలిన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ ‘500 అనుమానాలు, 1000 రహస్యాలు, 2000 తప్పులు. కర్ణాటక ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని కప్పిపుచ్చుకునే ఎత్తుగడలో భాగంగానే బీజేపీ ప్రభుత్వం రూ.2000 నోటును ఉపసంహరించుకుంది’ అని పేర్కొన్నారు.

మరోవైపు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ, ‘మొదట రూ.2వేల నోటు తెస్తే అవినీతి ఆగిపోతుందని చెప్పారు. ఇప్పుడేమో.. రూ.2వేల నోటును నిషేధిస్తే అవినీతి అంతమవుతుందని చెబుతున్నారు. అందుకే, దేశానికి చదువుకున్న ప్రధాని అవసరం. నిరక్షరాస్యుడైన ప్రధానికి ఎవరు ఏం చెప్పినా చేస్తారు. దాని పరిణామాలు అతనికి అర్థం కావు. మధ్యలో ఇబ్బంది పడేది ప్రజలే’ అని ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. కాగా, రూ.2వేల నోటును రద్దు చేస్తున్నట్టు ఆర్బీఐ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed