అంతర్జాతీయ కేరికేచర్ పోటీల్లో విజేతలుగా తెలుగు కార్టూనిస్టులు

by Disha Web Desk |
అంతర్జాతీయ కేరికేచర్ పోటీల్లో విజేతలుగా తెలుగు కార్టూనిస్టులు
X

దిశ, తెలంగాణ బ్యూరో : దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా 'నందమూరి తారక రామారావు – ఆయన వ్యక్తిత్వం' అనే అంశంపై 'కలయిక ఫౌండేషన్' అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కేరికేచర్ పోటీల్లో పలువురు తెలుగు వ్యక్తులు విజేతలుగా నిలిచారు. మొదటి బహుమతి బెంగుళూరుకు చెందిన కె.కుముదకు లభించగా, రెండో ప్రైజు హైదరాబాద్‌కు చెందిన కె.భవానికి దక్కింది. ప్రత్యేక బహుమతి కింద ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎన్ఆర్ కుమార్, మధు మంద ఫస్ట్ ప్రైజ్‌కు, హైదరాబాద్‌కు చెందిన అశ్వక్, జక్కుల వెంకటేశ్ ఎంపికయ్యారు. ఈ పోటీల ఫలితాలను తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణ శనివారం ప్రకటించారు. తొలి ప్రైజ్‌కు రూ. లక్ష, రెండో ప్రైజ్‌కు రూ. 75 వేలు, మూడో ప్రైజ్‌కు రూ. 50 వేల చొప్పున బహుమతిని అందజేశారు. ప్రత్యేక కేటగిరీలో ఒక్కొక్కరికి తలా రూ. 10 వేల చొప్పున అందజేశారు.


కవితల పోటీల్లో పెళ్ళూరు సునీల్ రాసిన 'తెలుగు అక్షరం' అనే కవితకు ఫస్ట్ ఫ్రైజ్ (రూ. 25 వేలు) లభించగా, డాక్టర్ కొప్పాడ శ్రీనివాసరావు రాసిన 'జగమునేలిన జగదేకవీరుడు', థర్డ్ ప్రైజ్‌కు ఎస్.ఆసియా రాసిన 'చెరగని నీడ' ఎంపికయ్యాయి. మరికొన్ని కవితలు ప్రత్యేక బహుమతికి ఎంపికయ్యాయి. ఎన్టీఆర్ పైన ఉన్న అభిమానంతో అంతర్జాతీయ స్థాయిలో ఈ పోటీలను నిర్వహించామని, ఇండోనేషియా, బ్రెజిల్ తదితర మొత్తం 60 దేశాలకు చెందినవారు పాల్గొన్నారని, కొద్దిమందికి ప్రైజులు కూడా లభించాయని నిర్వాహకులైన 'కలయిక ఫౌండేషన్' చైర్మన్ చేరాల నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.



Next Story