మోడీతో సాధ్యమైనప్పుడు.. నితీశ్‌తో ఎందుకు కాదు: తేజస్వీ యాదవ్

by Dishanational4 |
మోడీతో సాధ్యమైనప్పుడు.. నితీశ్‌తో ఎందుకు కాదు: తేజస్వీ యాదవ్
X

పాట్నా: బీహార్ నూతన డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా ఎన్నికైనప్పుడు, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ ఎందుకు కాకూడదని అన్నారు. గురువారం ఆయన జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. దేశానికి ప్రధాని అయ్యే హక్కు ప్రతి పౌరుడికి ఉందని అన్నారు. నితీశ్‌ పరిపాలన, సామాజిక అనుభవం కలిగి ఉన్నారని చెప్పారు. అంతేకాకుండా గతంలో ఆయన కేంద్ర మంత్రిగా పనిచేశారని పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీలన్ని ఒకేచోట సమావేశమై రోడ్డు మ్యాపును రూపొందించాలని, ఇప్పటికే ఆలస్యమైందని తెలిపారు. అప్పటికప్పుడే నూతన ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నట్లు తేజస్వీ చెప్పారు. బీజేపీ విధానాలతో నితీశ్ అసౌకర్యంగా ఉన్నారని గుర్తించామని అన్నారు. నితీశ్ రాజీనామా, తమ ఎమ్మెల్యేలను ఒప్పించడం వెంటవెంటనే జరిగిపోయాయని తెలిపారు.

బీహార్‌కు ఈ కూటమి అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటుందని ఆరోపించారు. అయితే ఈడీని వచ్చి తన ఇంట్లోనే కార్యాలయం ప్రారంభించాలని అహ్వానించారు. తన వివాహా విషయంలోనూ కుటుంబం సంపూర్ణ మద్దతు ఇచ్చినట్లు చెప్పారు. తన భార్య రచెల్ గోబిందో (రాజశ్రీ యాదవ్) క్రిస్టియన్ అయినప్పటికీ తన తండ్రి లాలూ యాదవ్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదని తెలిపారు. తన సోదరిలకు కూడా వివాహా విషయంలో లాలూ యాదవ్ స్వేచ్ఛ ఇచ్చారని ఈ 32 ఏళ్ల రాజకీయ నేత వెల్లడించారు. ఎన్డీఏ నుంచి బయటకొచ్చిన జేడీ(యూ) చీఫ్ నితీశ్ కుమార్ సీఎంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలతో మహాఘట్ బంధన్ ప్రభుత్వాన్ని తిరిగి ఏర్పాటు చేసి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. తేజస్వీ యాదవ్ కూడా డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేశారు.


Next Story

Most Viewed