తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ రాజీనామా: అరెస్టైన ఎమినిది నెలలకు రిజైన్

by Dishanational2 |
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ రాజీనామా: అరెస్టైన ఎమినిది నెలలకు రిజైన్
X

దిశ, నేషనల్ బ్యూరో: క్యాష్ ఫర్ జాబ్ కేసులో అరెస్టైన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించాలని గవర్నర్ ఆర్ఎన్ రవికి సీఎం స్టాలిన్ విజ్ఞప్తి చేసినట్టు డీఎంకే వర్గాలు తెలిపాయి. బాలాజీని గతేడాది జూన్ 14 మనీలాండరింగ్ కేసులో భాగంగా ఎన్ ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. 230 రోజులుగా జైలులో ఉన్నప్పటికీ మంత్రిగా ఎలా కొనసాగుతారని బెయిల్ పిటిషన్ విచారణలో భాగంగా మద్రాసు హైకోర్టు గతంలో ప్రశ్నించింది. ఆయనను మంత్రిగా కొనసాగించడం మంచిది కాదని తెలిపింది. అయితే తన బెయిల్ పిటిషన్‌ను మద్రాసు హైకోర్టు రెండు రోజుల్లో మరోసారి విచారించనుంది. ఈ నేపథ్యంలోనే సెంథిల్ రాజీనామా చేయడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రభుత్వ హయాంలో 2011 నుంచి 2015 వరకు బాలాజీ రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ క్రమంలో ఆ శాఖలో ఉద్యోగాలు ఇప్పించడానికి పలువురి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేయగా ఈడీ విచారణ ప్రారంభించింది. కాగా, అరెస్టు అయినప్పటి నుంచి బాలాజీ చాతీ నొప్పితో బాధపడుతున్నాడు..ఈ క్రమంలో ఓ ఆస్పత్రిలో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక జూలై 17 నుంచి పుఝల్ సెంట్రల్ జైలులో ఉన్నారు.

Read Disha E-paper

Next Story