గ్యాంబ్లింగ్ కోర్టు కాదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఫైర్ అయిన సుప్రీంకోర్టు

by Shamantha N |
గ్యాంబ్లింగ్ కోర్టు కాదు.. కాంగ్రెస్ ఎమ్మెల్యేపై ఫైర్ అయిన సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే వినయ్ కులకర్ణికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగలింది. బీజేపీ కార్యకర్త, ధార్వాడ్‌ జడ్పీటీసీ యోగేశ్ గౌడ్ హత్య కేసులో వినయ్ కులకర్ణిపై అభియోగాలు నమోదు చేయాలని ట్రయల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. ఈవిషయంలో కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులపై జోక్యం చేసకునేందుకు నిరాకరించింది. కులకర్ణితో పాటు 20 మందిపై ప్రత్యేక కోర్టు మోపిన అభియోగాలను సమర్థిస్తూ ఏప్రిల్ 8న హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కులకర్ణి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

గ్యాబ్లింగ్ కోర్టు కాదు

సీబీఐ దాఖలు చేసిన రెండో ఛార్జిషీటులో మాత్రమే ఎమ్మెల్యే పేరు ఉందని.. మృతుడి భార్య వాంగ్మూలంతో ఆయన పేరు లేదని కులకర్ణి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది. మృతుడి భార్యకి డబ్బు ఆశ చూపినట్లున్నారని మండిపడింది. ఇక, పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి సుప్రీం కోర్టును అనుమతి కోరగా.. ధర్మాసనం తిరస్కరించింది. సుప్రీంకోర్టులో మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడం.. మళ్లీ వెనక్కు వెళ్లడం ఇదంతా ఏంటి అని ప్రశ్నించింది. ఇది గ్యాంబ్లింగ్ కోర్టు కాదు అని ఫైర్ అయ్యింది.

యోగేశ్ గౌడ్ హత్య కేసు

యోగేశ్ గౌడ్ హత్య కేసులో కర్ణాటక పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. 2019లో బీజేపీ ప్రభుత్వం ఈ కేసుని సీబీఐకి బదిలీ చేసింది. 2020లో కులకర్ణి అరెస్టు కాగా.. అతనిపై ఛార్జిషీటు దాఖలైంది. 2023 డిసెంబర్ లో ట్రయల్ కోర్టు కులకర్ణిపై అభియోగాలు మోపింది. తనపై అభియోగాలు మోపుతూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ కులకర్ణి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. 2016 ఏప్రిల్ లో జరిగిన పంచాయతీ సమావేశంలో గొడవ జరగడంతో.. కులకర్ణి సహా అతని స్నేహితులు యోగేశ్ హత్యకు కుట్ర పన్నారని కోర్టు గుర్తించింది. పిటిషనర్‌పై మూడు నెలల్లోగా విచారణను పూర్తి చేసి, కేసును పరిష్కరించాలని కర్ణాటక హైకోర్టు.. ప్రత్యేక కోర్టుని కోరింది.



Next Story

Most Viewed