ఎన్నికల బాండ్ల‌ ‘నంబర్లూ’ చెప్పాల్సిందే.. ఎస్‌బీఐకు మరో డెడ్‌లైన్

by Dishanational4 |
ఎన్నికల బాండ్ల‌ ‘నంబర్లూ’ చెప్పాల్సిందే.. ఎస్‌బీఐకు మరో డెడ్‌లైన్
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎలక్టోరల్‌ బాండ్ల కేసులో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తంచేసింది. తమ ఆదేశాల ప్రకారం ఎన్నికల బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ సీరియల్ కోడ్‌ నంబర్లను కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వకపోవడంపై బ్యాంకును నిలదీసింది. ఆ వివరాలను అందిస్తేనే ఏ కంపెనీ, ఏ రాజకీయ పార్టీకి ఎన్ని విరాళాలను ఇచ్చిందో తెలుస్తుందని పేర్కొంది. మార్చి 21లోగా ఎన్నికల బాండ్ల ఆల్ఫా న్యూమరిక్ సీరియల్ కోడ్‌ నంబర్లు సహా ఎలక్టోరల్ బాండ్లతో ముడిపడిన అన్ని వివరాలను వెల్లడించాలని ఎస్‌బీఐని దేశ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. ఆ వివరాలన్నీ ఈసీకి సమర్పించి.. ఎన్నికల బాండ్లకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని దాచలేదని తెలుపుతూ మార్చి 21న సాయంత్రం 5 గంటల్లోగా తమకు అఫిడవిట్‌‌ను సమర్పించాలని ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేష్ ఖారాకు సుప్రీంకోర్టు నిర్దేశించింది. ఈ వివరాలు అందిన వెంటనే వాటిని ఎన్నికల సంఘం తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని స్పష్టం చేసింది.

ఎస్‌బీఐ సెలెక్టివ్‌గా ఉండకూడదు

‘‘బాండ్ల విషయంలో ఎస్‌బీఐ సెలెక్టివ్‌గా ఉండకూడదు. దీనికి సంబంధించిన ప్రతి సమాచారం బయటకు రావాలి. దేన్నీ అణచివేయకూడదనే ఉద్దేశంతోనే అన్ని వివరాలను ఇవ్వాలని మేం తీర్పు చెప్పాం. ఏ దాత ఏ పార్టీకి ఎంత ఇచ్చారనే విషయాన్ని తెలియజేసే ఆల్ఫా న్యూమరిక్ సీరియల్ కోడ్‌ నంబర్లతో పాటు అన్ని వివరాలను ఈసీకి ఎస్‌బీఐ ఇవ్వాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహాలకు ఇక తావులేదు’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ సందర్భంగా తేల్చి చెప్పింది. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఎస్‌బీఐ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే.. ఎలక్టోరల్ బాండ్ల సీరియల్‌ కోడ్‌ను సైతం ఎస్‌బీఐ అందిస్తుందని కోర్టుకు తెలిపారు. ‘‘మేం ఎలక్టోరల్‌ బాండ్లకు సంబంధించి మా వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని అందిస్తాం. ఎలాంటి డేటాను ఎస్‌బీఐ తన వద్ద ఉంచుకోదు’’ అని సాల్వే చెప్పారు.

ఆ ఒక్క సమాచారం లేకుండా..

ఎన్నికల బాండ్ల స్కీంను రద్దు చేస్తూ ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. 2018 నుంచి 2024 ఫిబ్రవరి వరకు జారీ చేసిన ఎన్నికల బాండ్ల వివరాలను ఈసీకి అందించాలని ఎస్‌బీఐని కోర్టు ఆదేశించింది. ఆ సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఎస్‌బీఐ.. బాండ్ల ఆల్ఫా న్యూమరిక్‌ నంబర్లను మాత్రం బయటపెట్టలేదు. ఏ రాజకీయ పార్టీకి ఏ వ్యక్తి/సంస్థ ఎన్ని విరాళాలు ఇచ్చారనేది ఈ నంబర్ల ఆధారంగానే తెలుస్తుందని.. ఆ సమాచారం లేకపోవడంపై సుప్రీంకోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆ వివరాలను విడుదల చేయాల్సిందేనని తాజాగా సోమవారం ఎస్‌బీఐని ఆదేశించింది.


Next Story