బిలియనీర్ జార్జ్ సోరోస్ కామెంట్స్‌పై స్మృతి ఇరానీ ఫైర్

by Disha Web Desk 2 |
బిలియనీర్ జార్జ్ సోరోస్ కామెంట్స్‌పై స్మృతి ఇరానీ ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: అదానీ అంశంపై అమెరికాకు చెందిన బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. సోరోస్ వ్యాఖ్యలు భారత దేశంపై దాడిగా అభివర్ణించారు. ఆయన తన వ్యక్తిగత అవసరాల కోసం ప్రభుత్వాన్ని ప్రభావితం చేయాలనుకుంటున్నారని, ప్రధాని మోడీని టార్గెట్‌గా చేసుకునేందుకే బిలియన్ డాలర్ల ఫండింగ్ ప్రకటించినట్టుగా ఉందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన స్మృతి ఇరానీ.. గతంలో భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి విదేశీ శక్తులు ప్రయత్నాలు చేశాయని కానీ అలాంటి వారిని భారతీయులు ఓడించారని గుర్తు చేశారు.

జార్జ్ సోరోస్ కు తగిన బుద్ధి చెప్పాలని ప్రతి భారతీయుడిని కోరుతున్నట్లు పిలుపునిచ్చారు. సోరోస్ వ్యాఖ్యలు భారత ప్రజాస్వామ్య ప్రక్రియలను నాశనం చేసే విధంగా ఉన్నాయని ధ్వజమెత్తారు. భారత ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచేందుకు ఎవరెన్ని దుష్ట పన్నాగాలు పన్నినా ప్రధాని మోడీ నాయకత్వంలో బలంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. కాగా 8.5 బిలియన్ డాలర్ల ఆస్తి కలిగిన ప్రపంచ బిలియనీర్ సోరోస్.. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ స్థాపకుడు. జవాబుదారీతనం, వాక్ స్వేచ్ఛను ప్రమోట్ చేసే సంస్థలు, వ్యక్తులకు గ్రాంట్స్ ఇస్తుంటారు.

గౌతమ్ అదానీ కంపెనీలపై హిండెన్ బర్గ్ నివేదిక నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ అంశం భారత్ లో పెట్టుబడులు పెట్టే వారి విశ్వాసానికి ఇది కుదుపులాంటిదని అన్నారు. ప్రస్తుతం ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఎదుర్కొంటున్న కష్టాలు భారత్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు ఊతమిస్తాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఈ అంశంలో ప్రధాని మోడీ మౌనం వీడి విదేశీ పెట్టుబడిదారులకు, పార్లమెంట్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సూచించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో రియాక్ట్ అవుతోంది.

Next Story

Most Viewed