నేడు ‘బ్లాక్ డే’.. ఎందుకో తెలుసా ?

by Dishanational5 |
నేడు ‘బ్లాక్ డే’.. ఎందుకో తెలుసా ?
X

దిశ, నేషనల్ బ్యూరో: తమ సహచరుడి మృతితో రెండు రోజులపాటు ‘ఢిల్లీ చలో’కు విరామం ప్రకటించిన రైతులు.. తమ తదుపరి కార్యాచరణను గురువారం ప్రకటించారు. ఢిల్లీ మార్చ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ, శంభూ సరిహద్దు వద్ద బైఠాయింపు నిరసన ప్రదర్శనలు మాత్రం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతు సంఘం నేతలు గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. పోలీసుల దాడిలో మృతిచెందిన యువ రైతు శుభకరణ్ సింగ్ కుటుంబానికి కేంద్రం రూ.కోటి పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఆందోళనల్లో ‘సంయుక్త కిసాన్ మోర్చ’(ఎస్కేఎం) సైతం పాల్గొనబోతుందని వెల్లడించారు. గతంలో కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలకు ఎస్కేఎం రైతు సంఘమే నేతృత్వం వహించింది. ప్రస్తుత ఆందోళనలకు సంయుక్త కిసాన్ మోర్చ(నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చ(కేఎంఎం) రైతు సంఘాలు సారథ్యం వహిస్తున్నాయి. ‘ఢిల్లీ చలో’ ఆందోళనల్లో ఎస్కేఎం ఇప్పటివరకు భాగస్వామ్యం కాలేదు. కానీ, శుక్రవారం నుంచి పాల్గొనబోతున్నట్టు వెల్లడించింది. ఇక నుంచి దేశవ్యాప్తంగా వరుసగా మెగా ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తామని రైతు నేతలు వెల్లడించారు. ‘‘శుక్రవారం నుంచి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నాం. ఇందులో భాగంగా తొలి రోజైన శుక్రవారం బ్లాక్ డే లేదా ఆక్రోశ్ దివాస్‌గా పాటిస్తాం. ఆ తర్వాత ఈ నెల 26న ట్రాక్టర్ పరేడ్ చేపడతాం. వచ్చే నెల 14న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ మహాపంచాయితీ నిర్వహిస్తాం. ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి లక్షమందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది’’ అని రైతు నేత అవిక్ సాహా వెల్లడించారు. ‘‘రైతులకు కేంద్రం చేసిన అన్యాయానికి నిరసనగా శుక్రవారం బ్లాక్ డే పాటిస్తాం. అలాగే, నిరసనల్లో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబానికి కేంద్రం రూ.కోటి పరిహారం అందజేయాలి. వారి రుణాలు మాఫీ చేయాలి. అతని మృతికి బాధ్యులైన వారిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని సంయుక్త సమాజ్ మోర్చా పార్టీ చీఫ్ బల్బీర్ సింగ్ రాజేవాల్ తెలిపారు. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) చట్టం తీసుకొచ్చే వరకు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed