యూబ్యూబ్‌పై కోర్టుకెక్కిన యువకుడికి షాక్

by Disha Web Desk |
యూబ్యూబ్‌పై కోర్టుకెక్కిన యువకుడికి షాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో : 'నేను పరీక్షల కోసం సిద్ధమవుతున్నాను. యూట్యూబ్ చూస్తుంటే తరచూ అసభ్యకరమైన పోస్టులు వస్తున్నాయి. దీంతో, నేను పరీక్షలపై దృష్టిసారించలేకపోతున్నాను. ఇటీవల రాసిన పరీక్షలో కూడా అర్హత సాధించలేకపోయాను. దీనికి కారణమైన యూబ్యూబ్ నుంచి నాకు పరిహారం ఇప్పించండి'అంటూ మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు సుప్రీంకోర్టు మెట్లెక్కాడు. సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడు ఇటీవల ఒక పోటీ పరీక్ష రాసి, అర్హత సాధించలేకపోయాడు. గూగుల్‌కు చెందిన యూట్యూబ్‌లో తాను చూసిన కొన్ని అడ్వర్టయిజ్మెంట్ల వల్లే ఎగ్జామ్‌లో నెగ్గలేకపోయానన్నాడు. దీంతో, ఇదే అభియోగాన్ని మోపుతూ యూట్యూబ్‌పై అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఈ పిటిషన్ వేశాడు. ఇందుకు గానూ గూగుల్ నుంచి రూ.75 లక్షల పరిహారం ఇప్పించాలని కోర్టును కోరాడు.

శుక్రవారం ఈ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం యువకుడికి షాక్ ఇచ్చింది. జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎ.ఎస్.ఓకాలతో కూడిన ధర్మాసనం పిటిషన్‌‌ను కొట్టివేసింది. అంతేకాకుండా, పిటిషనర్‌కు చివాట్లు అంటించింది. అడ్వర్టయిజ్మెంట్‌ను చూసి పోటీ పరీక్షల ప్రిపరేషన్‌పై శ్రద్ధ లేకుండా పోయిందని ఆరోపించడం సరికాదని పేర్కోంది. నీకు ప్రకటనలు నచ్చకపోతు చూడకు... అది చూడాలా వద్దా అని నిర్ణయించుకోవాల్సింది నువ్వే. ఆ అడ్వర్టయిజ్మెంట్‌ను చూడమని మీకెవరూ చెప్పలేదే ? దాన్ని మీరు చూడకుండా ఉండాల్సింది అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇది దారుణమైన పిటిషన్. ఇలాంటి పిటిషన్ల వల్లే న్యాయ వ్యవస్థ విలువైన సమయం వృథా అవుతోందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో లక్ష రూపాలయల జరిమానా చెల్లించాలని యువకుడిని కోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు అతడికి తొలుత లక్ష రూపాయల జరిమానా విధించగా... తాను నిరుద్యోగినని అంత జరిమానా కట్టలేనని విజ్ఞప్తి చేశాడు. దీంతో ఫైన్ తగ్గిస్తాము కానీ, నిన్ను క్షమించం అంటూ జరిమానా మొత్తాన్ని లక్ష నుంచి 25వేల రూపాయలకు తగ్గించింది. కాగా, సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో అశ్లీలతను నిషేధించాలని కూడా ఆ వ్యక్తి తన పిటిషన్‌లో కోరడం గమనార్హం.


Next Story

Most Viewed