- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీట్ పేపర్ లీక్ కేసులో కీలక నిందితురాలికి షాక్.. మనీషా వాఘ్‌మారే బెయిల్ తిరస్కరణ
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ యూజీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలక నిందితురాలికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ యూజీ (NEET-UG 2026) ప్రశ్నపత్రం లీకేజీ కేసులో కీలక నిందితురాలికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో నిందితురాలైన మనీషా వాఘ్‌మారే దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను మంగళవారం ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తులో భాగంగా ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
సీబీఐ తీవ్ర ఆరోపణలు..
పుణేకు చెందిన ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ మనీషా వాఘ్‌మారే ఈ లీకేజీ కుట్రలో ప్రధాన సూత్రధారిగా వ్యవహరించారని సీబీఐ కోర్టుకు తెలిపింది. లీకైన ప్రశ్నపత్రాన్ని పొంది, దానిని ఇతర నిందితులకు, విద్యార్థులకు పంపిణీ చేసినట్లు ఆరోపించింది. ఇందుకు ప్రతిఫలంగా ఆమె విద్యార్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు బ్యాంక్ లావాదేవీల ఆధారాలు, విద్యార్థుల వాంగ్మూలాలు ఉన్నాయని స్పష్టం చేసింది. రిటైర్డ్ కెమిస్ట్రీ టీచర్ ప్రహ్లాద్ కుల్కర్ణి ద్వారా ఈ ప్రశ్నపత్రం మనీషాకు చేరిందని, అక్కడి నుంచి ఆమె ఇతరులకు చేరవేసిందని సీబీఐ వివరించింది.
డిఫెన్స్ వాదనలు.. కోర్టు తిరస్కరణ
మనీషా తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆమె కేవలం సర్టిఫైడ్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ మాత్రమేనని, విద్యార్థులను టీచర్లకు రిఫర్ చేసి కమిషన్ తీసుకునేవారని పేర్కొన్నారు. ఆమె ఇంట్లో జరిపిన సోదాల్లో ఎలాంటి నగదు లేదా పత్రాలు లభించలేదన్నారు. అంతేకాకుండా, ఆమె వెర్టిగో (కళ్లు తిరగడం) వ్యాధితో బాధపడుతున్నందున వైద్య కారణాలపై బెయిల్ ఇవ్వాలని కోరారు. అయితే, జైలు ఆసుపత్రిలోనే తగిన వైద్య వసతులు ఉన్నాయని పేర్కొన్న కోర్టు, బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చింది.
మరో నిందితుడి పిటిషన్‌పై విచారణ
ఇదే కేసులో అరెస్ట్ అయిన మరో నిందితుడు యశ్ యాదవ్ దాఖలు చేసిన 15 రోజుల మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై స్పందించాలని కోర్టు సీబీఐని ఆదేశించింది. జూన్ 21న జరగనున్న నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు, తన సోదరి వివాహంలో పాల్గొనేందుకు బెయిల్ ఇవ్వాలని అతడు కోరగా, తదుపరి విచారణను కోర్టు జూన్ 12కు వాయిదా వేసింది. కాగా, మే 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ కావడంతో దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనితో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షను రద్దు చేసి, సమగ్ర దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగించింది.






