గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్.. 6 నెలల్లో తేలనున్న ఫ్యూచర్!

by Disha Web Desk 2 |
గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో షాక్.. 6 నెలల్లో తేలనున్న ఫ్యూచర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: అక్రమ మైనింగ్ కేసులో మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టు షాకిచ్చింది. బెయిల్ నిబంధనలు సడలించాలని ఆయన వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టివేసింది. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన కేసును హైదరాబాద్ సీబీఐ కోర్టు తక్షణం రోజువారీ విచారణ ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించింది. తాను బళ్లారిలో ఉండేదుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో కోరగా కేవలం నెల రోజులు మాత్రమే అక్కడ ఉండేందుకు గాలి జనార్ధన్ రెడ్డికి అనుమతి ఇస్తూ పిటిషన్ పై జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ కృష్ణ మురారి ధర్మాసనం తుది ఉత్తర్వులు ఇచ్చింది. 2009 నుంచి గాలి జనార్ధన్ రెడ్డిపై సీబీఐ నమోదు చేసిన గనుల అక్రమ తవ్వకాల కేసు విచారణ ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం హైదరాబాద్ నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో ఈ కేసు విచారణలో ఉంది. అయితే 12 ఏళ్ల క్రితం నమోదైన ఈ కేసులో ఇప్పటి వరకు కోర్టులో ట్రయల్ జరగకపోవడంపై ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఇన్నేళ్లు అవుతున్నా కోర్టులో ట్రయల్స్ జరగకపోవడం విచారకరమని వ్యాఖ్యానించింది. తీవ్ర అభియోగాలు ఉన్న ఇలాంటి కేసులో ట్రయల్స్ జాప్యం అంటే న్యాయస్థానాన్ని అపహాస్యం చేయడమేనని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఆరు నెలల్లో గాలి జనార్ధన్ రెడ్డి ఫ్యూచర్ పై క్లారిటీ రానుంది.

Next Story

Most Viewed