పార్టీని కొత్త తరం నడిపించాలి.. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ షాకింగ్ నిర్ణయం

by Vinod kumar |
పార్టీని కొత్త తరం నడిపించాలి.. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ షాకింగ్ నిర్ణయం
X

ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) చీఫ్ శరద్ పవార్ బాంబు పేల్చినంత పని చేశారు. ఎన్‌సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నాయకుడు మంగళవారం ప్రకటించారు. ఆయన మేనల్లుడు అజిత్ పవార్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఇది జరిగి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ‘1960 మే 1 నుంచి 2023 మే 1 వరకు సుదీర్ఘ ప్రజా జీవితం తర్వాత ఒక అడుగు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది’ అని 82 ఏళ్ల శరద్ పవార్ అన్నారు.

ముంబైలో తన ఆటోబయోగ్రఫీ సందర్భంగా ఈ సంచలన ప్రకటన చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. ‘పార్టీకి కొత్త తరం మార్గనిర్దేశం చేయాల్సిన సమయం ఇది. పార్టీ ప్రెసిడెంట్ ఎన్నికపై కమిటీ సభ్యులు నిర్ణయం తీసుకోవాలని సిఫారసు చేస్తున్నాను’ అని శరద్ పవార్ చెప్పారు.

పార్టీ సీనియర్ నాయకుల ప్యానెల్ ప్రకటన..

నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్‌తో కలిసి ఈ ఆశ్చర్యకరమైన ప్రకటన చేశారు. ఆయన నిర్ణయానికి ఎన్‌సీపీ కార్యకర్తలు, నాయకులు నిరసన తెలిపారు. వారిలో చాలా మంది కన్నీళ్లుపెట్టుకున్నారు. పార్టీని ముందుకు నడిపించేందుకు సీనియర్ నాయకులతో కూడిన ప్యానెల్‌ను శరద్ పవార్ ప్రకటించారు. ‘నేను ప్రజా జీవితానికి దూరం కావడం లేదు. నన్ను ప్రజల నుంచి ఎవ్వరూ విడదీయలేరు. నేను మీతో ఉన్నాను. చివరి శ్వాస వరకు మీతోనే ఉంటాను’ అని ఆయన చెప్పారు.

రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఉద్వేగానికి గురైన పార్టీ కార్యకర్తలు, నాయకులు శరద్ పవార్‌ను వేడుకున్నారు. అలా చేస్తే తప్ప వదిలిపెట్టబోమని చెప్పారు. అయితే శరద్ పవార్ తన రాజీనామాను ప్రకటించే ముందు ఎవరితోనూ చర్చించలేదని ఎన్‌సీపీ అగ్రనేత, రాజ్యసభ సభ్యుడు ప్రఫుల్ పటేల్ అన్నారు.

నిర్ణయాన్ని వెనక్కి తీసుకోరు: అజిత్

ఈ అవకాశాన్ని అజిత్ పవార్ సద్వినియోగం చేసుకుంటాడనే వార్తలు అందుతున్నాయి. ఎందుకంటే ఎన్‌సీపీ తదుపరి అధ్యక్షుడు శరద్ పవార్ మార్గదర్శకత్వంలో పని చేస్తారు అని అజిత్ అన్నారు. ‘పార్టీ నాయకత్వంలో మార్పు రావాలని పవార్ సాహెబ్ ఇటీవలే చెప్పారు. వయస్సు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన నిర్ణయాన్ని చూడాలి. కాలాన్ని బట్టి ప్రతి ఒక్కరూ నిర్ణయం తీసుకుంటారు. పవార్ సాహెబ్ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఆయన దానిని వెనక్కి తీసుకోరు’ అని అజిత్ పవార్ చెప్పారు. మేడే (మే 1) సందర్భంగా తన మేనమామ రాజీనామాను ప్రకటించాలని అనుకున్నారని.. కానీ మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) ర్యాలీ కారణంగా వాయిదా వేసినట్టు అజిత్ తెలిపారు.

మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే ఊహాగానాలు రావడంతో శరద్ పవార్ పెద్ద ఎత్తుగడే వేసినట్టు తెలుస్తోంది. గత నెలలో పార్టీ ముంబై యూనిట్ సమావేశానికి అజిత్ డుమ్మా కొట్టడంతో ఊహాగానాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తనకు వేరే పనులు ఉండటం వల్ల ఎన్‌సీపీ సమావేశానికి హాజరు కాలేకపోయానని అజిత్ అన్నారు. తను జీవించినంత కాలం ఎన్‌సీపీ కోసమే పని చేస్తానని కూడా ఆయన ప్రకటించారు.

బీజేపీతో చేతులు కలిపేందుకు మార్గమం సుగమమైందా..?

శరద్ పవార్ షాకింగ్ నిర్ణయం తీర్వాత అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ బీజేపీతో చేతులు కలిపేందుకు మార్గం సుగమమైందని కొందరు నేతలు అంటున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దీనిని బహిరంగంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ కొంత మంది బీజేపీ నేతలు అజిత్‌కు అండగా నిలుస్తున్నారు. అజిత్ పవార్ ఎన్‌సీపీ నేతలతో కలిసి బీజేపీలో చేరితే ప్రభుత్వంలో భాగస్వాములం కాలేమని షిండే నేతృత్వంలోని శివ సేన వర్గం అంటోంది. శరద్ పవార్‌ను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీకి చెందిన దేవేంద్ర ఫడ్నివీస్ ప్రభుత్వంలో అజిత్ పవార్ 2019 నవంబర్ 23న ఉప ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేశారు. కానీ ఆ ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోలేక నవంబర్ 28న పడిపోయింది.

15 రోజుల క్రితమే చెప్పిన శరద్ పవార్ కూతురు..

శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే 15 రోజుల క్రితమే బాంబు పేలుడు లాంటి విషయం చెప్పారు. రాబోయే 15 రోజుల్లో రెండు పెద్ద రాజకీయ పేలుళ్లు సంభవిస్తాయన్నారు. 15 రోజుల్లో పెద్ద రాజకీయ పెలుళ్లు సంభవిస్తాయన్న ప్రకాశ్ అంబేద్కర్ వ్యాఖ్యలపై సుప్రియా స్పందిస్తూ.. ఒకటి ఢిల్లీలో మరొకటి మహారాష్ట్రలో జరుగుతాయని అన్నారు. మహారాష్ట్రలో తన సంఖ్యా బలాన్ని పెంచకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. తమ పార్టీలోకి అజిత్ పవార్ వస్తే స్వాగతిస్తామని గతంలో చెప్పింది.

కొంత మంది ఎమ్మెల్యేలు కూడా అజిత్‌కు మద్దతు తెలపడంతో ఊహాగానాలు తీవ్రమయ్యాయి. కేంద్ర రక్షణ, వ్యవసాయ మంత్రిగా పనిచేసిన శరద్ పవార్ దేశ అగ్ర ప్రతిపక్ష నాయకులలో ఒకరు. అసాధ్యం అనుకున్న శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీ కూటమితో కలిసి మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

Next Story

Most Viewed