దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయ కార్మికులు మృతి

by Malleboina Mahesh |

దుబాయ్ ఎమిరేట్స్ రోడ్డుపై మినీబస్సు, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో ఏడుగురు భారతీయ కార్మికులు మృతి. తొమ్మిది మంది గాయాలు.

దుబాయ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు భారతీయ కార్మికులు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: దుబాయ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది. దుబాయ్ ఎమిరేట్స్ రోడ్డుపై జరిగిన ఈ భయానక ప్రమాదంలో మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషాద ఘటనను దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం (Consulate General of India in Dubai) అధికారికంగా ధృవీకరించింది. దుబాయ్ ట్రాఫిక్ పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. సాంకేతిక లోపం కారణంగా ఒక భారీ ట్రక్కు ఎమిరేట్స్ రోడ్డు మధ్యలో హఠాత్తుగా ఆగిపోయింది. అదే సమయంలో కార్మికులతో వెళ్తున్న ఒక మినీ బస్సు డ్రైవర్, ముందున్న వాహనాన్ని గమనించకపోవడం మరియు సురక్షితమైన దూరాన్ని పాటించకపోవడంతో ఆగి ఉన్న ట్రక్కును వెనుక నుండి అత్యంత వేగంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. గాయపడిన తొమ్మిది మందిలో ఐదుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన భారత రాయబార కార్యాలయ అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. చికిత్స పొందుతున్న భారతీయ పౌరులను పరామర్శించి, వారికి మెరుగైన వైద్య సేవలు అందేలా చూస్తున్నారు. బాధితులకు, వారి కుటుంబాలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను అందించేందుకు దుబాయ్ పోలీస్, స్థానిక ఆరోగ్య శాఖ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎంబసీ పేర్కొంది. సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కాన్సులేట్ జనరల్ స్పందిస్తూ.. ఈ కష్ట సమయంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు తమ గాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల వివరాలు తెలియాల్సి ఉండగా.. భారత్ లో ఉన్న వారికి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

Next Story