దేశంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తుందా..? కాంగ్రెస్

by Satheesh |
దేశంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తుందా..? కాంగ్రెస్
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: రాహుల్‌గాంధీ లోకసభ సభ్యత్వాన్ని రద్దు చేయటాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని రాజఘాట్ వద్ద కాంగ్రెస్ తలపెట్టిన సంకల్ప్ సత్యాగ్రహానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. రాజఘాట్ పరిసరాల్లో 144 సెక్షన్ అమలవుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవ్వరూ అక్కడికి రావొద్దని సూచించారు. కాంగ్రెస్ శ్రేణులు ఈ ఆకస్మిక నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసుల ఆంక్షలను ధిక్కరించి కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ప్రియాంకాగాంధీ తదితరులంతా అక్కడకు చేరుకుని దీక్షలో పాల్గొన్నారు. దేశంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తున్నదా లేక నియంత పాలన సాగుతున్నదా అని వారు ప్రశ్నించారు.

రాహుల్‌గాంధీ లోకసభ సభ్యత్వాన్ని రద్దుచేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరపాలని నిర్ణయించింది. సోనియాగాంధీ నేతృత్వంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ తదితర అగ్రనేతలు రాజఘాట్ వద్ద సత్యాగ్రహం జరపాలని పార్టీ నిర్ణయించింది. రాహుల్‌గాంధీ సైతం పాల్గొంటారని తెలిపింది. అనుమతి కోసం పోలీసులకు ముందుగానే దరఖాస్తు చేసుకున్నది. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా నిరసన కూడా చెయ్యనివ్వరా అని మండిపడ్డారు. అదానీని కాపాడటానికే బీజేపీ ప్రభుత్వం, ప్రధాని మోడీ ఇలా చేస్తున్నారని ఆరోపించారు. సత్యాగ్రహం చేసి తీరుతామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చెయ్యటంతో ఏం జరుగుతుందన్నది ఉత్కంఠంగా మారింది.

Next Story

Most Viewed