మార్చి 15న ఆర్ఎస్ఎస్ కోటలో ఎన్నికల నగారా

by Dishanational4 |
మార్చి 15న ఆర్ఎస్ఎస్ కోటలో ఎన్నికల నగారా
X

దిశ, నేషనల్ బ్యూరో : త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ఏబీపీఎస్) కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. మార్చి 15 నుంచి మూడు రోజుల పాటు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌‌లో ఉన్న ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం వేదికగా ఏబీపీఎస్ ప్రతినిధులకు సదస్సు జరగనుంది. ఇందులో ఆర్‌ఎస్‌ఎస్ నేతలు మోహన్ భగవత్, దత్తాత్రేయ హోసబాలే సంఘ్ పరివార్ సీనియర్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 2025లో ఆర్ఎస్ఎస్ 100వ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో కమలదళాన్ని ఎన్నికల్లో గెలిపించేందుకు అంకిత భావంతో పనిచేయాలని ఆర్ఎస్ఎస్ శ్రేణులకు ఈ సమావేశం వేదికగా పిలుపునివ్వనున్నారు. నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) కూటమికి 400 లోక్‌సభ సీట్లను సాధించాలనే లక్ష్యంపై ఈసందర్భంగా సంకల్పాన్ని ప్రకటించనున్నారు. ఈ సమావేశం వేదికగానే బీజేపీ ఎన్నికల వ్యూహాన్ని బీఎల్ సంతోష్ ఆర్‌ఎస్‌ఎస్ అధి నాయకత్వానికి సమర్పించి దాని నుంచి సూచనలను తీసుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నారు. బీజేపీ 350 లోక్‌సభ సీట్ల లక్ష్యం, దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ అమలు, మణిపూర్ వివాదం, రైతుల నిరసనలు,బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ సమస్య వంటి అంశాలపై ఎన్నికల్లో ఎలా ముందుకుపోవాలనే దానిపై రోడ్‌మ్యాప్‌ను రెడీ చేసుకోనున్నారు. జ్ఞానవాపి మసీదు, మధుర ఈద్గా వంటి వివాదాస్పద అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశం లేదని తెలుస్తోంది. సదస్సులో చివరి రోజున ఏబీపీఎస్ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. సమావేశాల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్, ప్రధాన కార్యదర్శి (సంస్థ) బీఎల్ సంతోష్‌, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సహా వివిధ అనుబంధ సంస్థలకు చెందిన దాదాపు 1,550 మంది నాయకులు పాల్గొంటారు.

Next Story

Most Viewed