'మత ప్రాతిపదికన జనాభా అసమానతను విస్మరించరాదు'

by Nagaya |
మత ప్రాతిపదికన జనాభా అసమానతను విస్మరించరాదు
X

నాగ్‌పూర్: సమాజంలోని అన్ని వర్గాలకూ సమానంగా వర్తించేలా సమగ్ర జనాభా విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ వ్యాఖ్యానించారు. నాగ్‌పూర్‌లో నిర్వహించిన దసరా వార్షిక ర్యాలీలో పాల్గొన్న భాగవత్ సామాజిక వర్గాల ప్రాతిపదికన జనాభా అసమానతను ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదని నొక్కి చెప్పారు. మతపరమైన, కమ్యూనిటీ పరమైన జనాభా అసమానత్వం కారణంగానే తూర్పు తైమూర్, కొసావో, దక్షిణ సూడాన్ వంటి కొత్త దేశాలు ఏర్పడ్డాయని చెప్పారు. జనాభాలో అసమానతలు దేశాల భౌగోళిక సరిహద్దులను మార్చివేస్తాయని హెచ్చరించారు. ఇటీవలే కొందరు ముస్లిం నేతలతో ఆర్ఎస్ఎస్ అధినేత భేటీ అయిన నేపథ్యంలో భాగవత్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

జనాభాకు ఎల్లప్పుడూ వనరుల అవసరం ఉంటుందని, లేకుంటే అది కచ్చితంగా సమాజానికి భారమవుతుందని భాగవత్ చెప్పారు. జనాభా ఒక సంపద అనే అభిప్రాయం ఉంటోందని, ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకుని సర్వసమగ్రమైన జనాభా విధానాన్ని భారత్ ఏర్పర్చుకోవాలని ఆయన తెలిపారు. జనాభా నియంత్రణ ప్రమాదకరమని, దశాబ్దాల పాటు ఒకే సంతానం విధానాన్ని అవలంబించిన చైనా ప్రస్తుతం వృద్ద దేశంగా మారుతోందని భాగవత్ తెలిపారు. ప్రస్తుతం భారత్‌లో 57 కోట్లమంది యువజనులు ఉన్నారని, దీంతో మరో 30 ఏళ్లపాటు యువదేశంగా కొనసాగనుందని చెప్పారు. అదే సమయంలో జనాభాకు అనుగుణంగా మన వనరులను పెంచుకోవడం అవసరమని ఆయన సూచించారు.

సంతానంపై ఏ విధానాన్ని రూపొందించినా సరే... మహిళల ఆరోగ్యాన్ని తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలని మోహన్ భాగవత్ చెప్పారు. ఈ సంవత్సరం దసరా ర్యాలీలో మొట్టమొదటి సారిగా ఒక మహిళను ప్రధాన అతిథిగా ఆర్ఎస్ఎస్ ఆహ్వానించింది. ప్రముఖ పర్వతారోహకురాలు సంతోష్ యాదవ్‌ను ఆర్ఎస్ఎస్ బుధవారం జరిగిన దసరా ర్యాలీకి ఆహ్వానించడం విశేషం.

Next Story

Most Viewed