జమిలి ఎన్నికలకు పార్టీలన్నీ సుముఖమే: రామ్‌నాథ్ కోవింద్

by Disha Web Desk 17 |
జమిలి ఎన్నికలకు పార్టీలన్నీ సుముఖమే: రామ్‌నాథ్ కోవింద్
X

న్యూఢిల్లీ: జమిలి ఎన్నికల ప్రతిపాదన అనేది దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమని మాజీ రాష్ట్రపతి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ చైర్‌పర్సన్‌ రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. ఇప్పటివరకు తాను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలను సంప్రదించానని, ప్రతీ రాజకీయ పార్టీ ఏదో ఒక సానుకూల అంశం దృష్ట్యా జమిలి ఎన్నికల నిర్వహణ మంచిదే అని చెప్పాయని వెల్లడించారు.

ఈ అంశానికి అన్ని పార్టీలు నిర్మాణాత్మక మద్దతును ప్రకటిస్తే దేశానికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు. జమిలి ఎన్నికల వల్ల పొదుపయ్యే డబ్బును అభివృద్ధి పనులకు ఖర్చు చేసుకోవచ్చని, దానివల్ల అంతిమంగా ప్రజలకే మేలు జరుగుతుందని కోవింద్ తెలిపారు.

ఇప్పటివరకు జరిగిన వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ సమావేశాల్లో జమిలి ఎన్నికలతో ముడిపడిన చట్టపరమైన, రాజ్యాంగ పరమైన అన్ని అంశాలపై వివరంగా చర్చించామని చెప్పారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీకి చేరుకున్న మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మీడియాతో మాట్లాడుతూ పై వివరాలను వెల్లడించారు.

Next Story