కరోనాకు ముందు స్థాయికి రైల్వే టికెట్ ధరలను తగ్గించిన కేంద్రం

by Dishanational1 |
కరోనాకు ముందు స్థాయికి రైల్వే టికెట్ ధరలను తగ్గించిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: భారతీయ రైల్వే ప్రయాణీకులకు అద్భుతమైన శుభవార్త అందించింది. రైల్వే ప్రయాణీకులకు భారీ ఉపశమనంగా, రైల్వే టికెట్ ధరలను కరోనాకు ముందునాటి స్థాయికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రతిరోజూ ప్రయాణించే వారికి భారీ ఊరటనివ్వనుంది. దీంతో ప్యాసింజర్ రైళ్ల ఛార్జీలు సుమారు 40-50 శాతం తగ్గాయి. గతంలో ప్యాసింజర్ ప్రయాణానికి ఎక్స్‌ప్రెస్ ఛార్జీలను చెల్లించాల్సి వచ్చేది. ఎక్స్‌ప్రెస్ స్పెషల్‌గా మార్చిన ప్యాసింజర్ రైళ్లలోని సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీలను మంగళవారం(ఫిబ్రవరి 27) నుంచి పునరుద్ధరిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. కరోనా మహమ్మారి లాక్‌డౌన్ తర్వాత, రైళ్ల పేర్లను మార్చడం ద్వారా కేంద్రం 'ప్యాసింజర్ రైళ్ల'ను క్రమంగా నిలిపివేసింది. ఆయా పేర్లకు తగినట్టుగా ఛార్జీలను వసూలు చేస్తోంది. దీనివల్ల ఆర్డినరీ ఛార్జీలు లేకుండా పోయాయి. ఎక్స్‌ప్రెస్ రైళ్లలో కనీస టికెట్ ధర రూ. 10 నుంచి రూ. 30కి పెరిగింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు రావడంతో రైల్వే బోర్డు సమీక్ష నిర్వహించిన అనంతరం తాజా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సాధారణ ఛార్జీ రూ.30 నుంచి రూ.10కి తగ్గింది. మంగళవారం ఉదయం సెకండ్ క్లాస్ ఆర్డినరీ రైళ్ల కనీసం టికెట్ ధరను పాత రేట్లతోనే వసూలు చేయాలని చీఫ్ బుకింగ్ రిజర్వేషన్ అధికారులకు తెలిపింది. మెయిన్ లైన్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్‌లో ఆర్డినరీ క్లాస్ టికెట్ ధరలు సగానికి తగ్గించారు. గతంలో ప్యాసింజర్ రైళ్లుగా ఉండి, ఇప్పుడు ఎక్స్‌ప్రెస్ స్పెషల్స్‌గా మారిన అన్ని రైళ్లకు ఈ మార్పులు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు. అన్-రిజ‌ర్వ్‌డ్ టికెటింగ్ సిస్ట‌మ్‌లోనూ వీటి ధ‌ర‌లు మార్చారు.


Next Story

Most Viewed