ఎంఎంటీఎస్ ఫేజ్-2పై తెలంగాణ సర్కార్ స్పందన కరువు.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

by Dishafeatures2 |
ఎంఎంటీఎస్ ఫేజ్-2పై తెలంగాణ సర్కార్ స్పందన కరువు.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎంఎంటీఎస్ ఫేస్ -2పై ఎన్ని సార్లు లేఖలు రాసినా తెలంగాణ సర్కార్ స్పందించడం లేదని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఆరోపించారు. సోమవారం తెలంగాణలోని రైల్వే ప్రాజెక్ట్‌లపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ ప్రశ్నలకు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ సమాధానమిచ్చారు. తెలంగాణలో ఎంఎంటీఎస్ ఫేజ్ -2 కోసం రూ.816.55 కోట్లు అంచనా వేయగా ఈ ఖర్చు రైల్వే, తెలంగాణ ప్రభుత్వం 1:2 నిష్పత్తిలో భరించాల్సి ఉందన్నారు.

ఇందులో 544.36 కోట్లు తెలంగాణ రాష్ట్రప్రభుత్వ వాటా ధనంలో కేవలం 279.02 కోట్లు మాత్రమే ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందని స్పష్టంచేశారు. మిగిలిన 265.34 కోట్ల కోసం కేంద్ర రైల్వే శాఖ అనేకమార్లు తెలంగాణ సర్కార్‌కు లేఖలు రాసినా పెడచెవిన పెట్టిందని విమర్శించారు. ఎంఎంటీఎస్ ఫేజ్ -2 కోసం కేంద్ర రైల్వే శాఖ తన వాటా ధనం కన్నా తెలంగాణకు అధికంగా కేటాయించిందని స్పష్టంచేశారు.

మనోరాబాద్ - కొత్తపల్లి, భద్రాచలం -కొవ్వూరు, అక్కన్నపేట - మెదక్, భద్రాచలం - సత్తుపల్లి, హైదరాబాద్ ఎంఎంటీఎస్ ఫేస్ -2 ఈ ఐదు ప్రాజెక్టులకు గాను రూ.7,350 కోట్ల గాను అంచనా ఉండగా రూ.2,588 కోట్లు ఇప్పటికే ప్రాజెక్టుల మీద ఖర్చు జరిగిందని తెలిపారు. రూ.1,279 కోట్లు తెలంగాణ ప్రభుత్వం తన వాటా కింద జమచేసిందన్నారు. ఇంకా రూ.986 కోట్లు తెలంగాణ ప్రభుత్వం తన వాటా కింద జమచేయాల్సి ఉందన్నారు. 2023-24కు గాను ఏకంగా రూ.4,418 కోట్లు కేటాయింపు కేంద్ర రైల్వే శాఖ చేసిందన్నారు.

రైల్వే ప్రాజెక్టుల కోసం తెలంగాణలో 2095 హెక్టార్ల రెవెన్యూ భూమి, 56 హెక్టార్ల ఫారెస్ట్ భూమి అవసరం కాగా ఇప్పటి వరకు తెలంగాణ సర్కారు 1918 హెక్టార్ల రెవెన్యూ భూమిని 41 హెక్టార్ల ఫారెస్ట్ భూమిని సేకరించిందని తెలిపారు. ఇంకా 41 హెక్టార్ల రెవెన్యూ భూమి, 15 హెక్టార్ల అటవీ భూమిని తెలంగాణ ప్రభుత్వం సేకరించాల్సి ఉందని స్పష్టంచేశారు. రైల్వే ప్రాజెక్టులు పూర్తి కావాలంటే రాష్ట్రాల నుంచి భూసేకరణ జరగాలని, అటవీశాఖ నుంచి క్లియరెన్సులు రావాలన్నారు. రాష్ట్రాల వాటా ధనం వెంటనే జమ కావాలన్నారు.



Next Story