చినిగిన కాంగ్రెస్ వెల్‌కమ్ ఫ్లెక్సీ.. వారే చేశారన్న పార్టీ నేతలు..

by Disha Web |
చినిగిన కాంగ్రెస్ వెల్‌కమ్ ఫ్లెక్సీ.. వారే చేశారన్న పార్టీ నేతలు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కాంగ్రెస్ బలోపేతానికి, బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ ప్రారంభించిన కార్యక్రమం భారత్ జోడో యాత్ర. ఈ యాత్రను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కొనసాగించనున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. అయితే ఈ యాత్ర సెప్టెంబర్ 30న కర్ణాటకకు చేరనుంది. ఈ క్రమంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి స్వాగతం పలుకుతూ అనేక ఫ్లెక్సీలు కట్టారు. అయితే గురువారం ఈ ఫ్లెక్సీలలో చాలా వరకు చినిగిపోయి ఉండటం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది.

భారత్ జోడో యాత్రకు లభిస్తున్న ప్రజాదరణ, విద్యార్థుల, నిరుద్యోగులు ఇస్తున్న మద్దతును చూసి ఓర్వలేక బీజేపీ మూకలు ఫ్లెక్లీలను చింపేశాయని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆరోపించాయి. రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ పార్టీ నేతల ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలను చింపేశారని, దాదాపు 40కి పైగా ఫ్లెక్సీలు చినిగిపోయాయని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. భారత్ జోడో యాత్ర పట్ల ఇప్పటికే పలువురు బీజేపీ నేతలు విమర్శలు చేశారని, కాంగ్రెస్ చేస్తున్న గొప్ప కార్యక్రమాన్ని చూడలేక వారే ఈ పనికి పాల్పడ్డారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నాయి.

దాంతో పాటుగా ఇప్పటికే మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రీ ఈ యాత్రపై విమర్శలు చేశారు. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ తన సెలవు చెప్తున్న కార్యక్రమంలా ఉందని ఆయన అన్నారు. అంతేకాకుడా భారత్ జోడో యాత్ర ఇప్పుడు కాంగ్రెస్ చోడో యాత్రగా మారిందని, పార్టీలో భయాందోళన వాతావరణం ఏర్పడిందని గులాం నబీ అజాద్ తన రాజీనామా లేఖలో కూడా పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు చింపిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయాలని, ఈ దారుణానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.

Next Story

Most Viewed