శంభు సరిహద్దులో బారికేడ్లను 7 రోజుల్లోగా తొలగించాలని హైకోర్టు ఆదేశం

by Harish |
శంభు సరిహద్దులో బారికేడ్లను 7 రోజుల్లోగా తొలగించాలని హైకోర్టు ఆదేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: న్యూఢిల్లీ-అంబాలా జాతీయ రహదారి వద్ద శంభు సరిహద్దులో ఏర్పాటు చేసిన బారికేడ్లను వారం రోజుల్లోగా తొలగించాలని పంజాబ్, హర్యానా హైకోర్టు బుధవారం హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఫిబ్రవరిలో కనీస మద్దతు ధర సహా, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ, సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ ఆధ్వర్యంలో రైతులు భారీ ఎత్తున ఢిల్లీలో నిరసనలు చేయడానికి బయలుదేరగా వారిని సరిహద్దులోనే ఆపడానికి బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పరిస్థితి కుదుటపడటంతో వాటిని తొలగించాలని కోర్టులో పిటిషన్ దాఖలు అయింది, తాజాగా దీనిని విచారించిన జస్టిస్ జిఎస్ సంధావాలియా, జస్టిస్ వికాస్ బహ్ల్‌లతో కూడిన హైకోర్టు బెంచ్ వాటిని తొలగించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

సరిహద్దును మూసివేయడం వలన సామాన్య ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని కోర్టు పేర్కొంది. విచారణ సందర్భంగా ఇంకా ఈ సరిహద్దులో ఎంతమంది రైతులు ఉన్నారని కోర్టు ఆరా తీయగా, దాదాపు 400-450 మంది రైతులు ఉన్నారని తెలియడంతో, శాంతిభద్రతల పరిస్థితిని భద్రతా సంస్థలు నిర్వహించగలవని పేర్కొంటూ బారికేడ్లను తొలగించాలని ఆదేశించింది. అలాగే, హర్యానా ప్రభుత్వానికి సహకారం అందించాలని పంజాబ్ ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. ఇంకా, బారికేడ్లు తెరిచిన తర్వాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని రైతు సంఘాలను హైకోర్టు కోరింది.

హర్యానా అదనపు అడ్వకేట్ జనరల్ దీపక్ సబర్వాల్ విలేకరులతో మాట్లాడుతూ, ఏడు రోజుల్లో బారికేడ్లను తొలగించాలని హర్యానా ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. ఒకవేళ ఏదైనా శాంతిభద్రతల పరిస్థితి తలెత్తితే, చట్ట ప్రకారం తిరిగి నివారణ చర్యలు తీసుకోవచ్చని కోర్టు పేర్కొందని అన్నారు.

Next Story