తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

by GSrikanth |
తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి నుంచి 5 రోజుల (సెప్టెంబర్ 22) పాటు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కీలక వ్యాఖ్యలు చేశారు. పాత పార్లమెంట్ భవనంలో ఎన్నో అద్భుతాలు జరిగాయని అన్నారు. ఎన్నో చారిత్రక ఘట్టాలు ఈ భవనంలో ఆవిష్కృతం అయ్యాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా పాత పార్లమెంట్‌లోనే జరిగిందని గుర్తుచేశారు.

తెలంగాణ హక్కులను కాలరాసే కుట్రలు జరిగాయని, తెలంగాణ ఏర్పాటు కోసం రక్తం ఏరులై పారిందని అన్నారు. యూపీఏ హయాంలో ఏపీ విభజన సరిగ్గా జరగలేదని విమర్శించారు. ఎన్నో వ్యయప్రయాసల మధ్య తెలంగాణ ఏర్పాటైందని, ఏపీ, తెలంగాణ ప్రజలు సంబురాలు చేసుకోలేదని ప్రధాని మోడీ లోక్‌సభలో ప్రసంగించారు. విభజన రెండు రాష్ట్రాలను సంతృప్తిపరచ లేకపోయిందని వెల్లడించారు. వాజ్‌పేయి హయంలోనూ రాష్ట్రాల విభజన జరిగిందని, విడిపోయిన రాష్ట్రాలు సంబరాలు చేసుకున్నాయని మోడీ అన్నారు.

ఈ పాత పార్లమెంట్ భవనాన్ని దేశ ప్రజలు చెమటోడ్చి కట్టారని భావోద్వేగానికి లోనయ్యారు. కొత్త భవనంలోకి వెళ్లినా.. పాత భవనాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు. దేశ ప్రజల సందర్శనార్థం పాత భవనాన్ని తెరిచే ఉంచుతామని కీలక ప్రకటన చేశారు. ఈ భవనం దేశ ప్రజల ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని చెప్పారు. ఇంద్రజిత్ గుప్త ఈ భవనంలో 43 ఏళ్ల పాటు సేవలు అందిచారని గుర్తుచేసుకున్నారు. పార్లమెంట్ భవనంలోకి వెళితే గుడిలోకి వెళ్లిన అనుభూతి వస్తుందని తెలిపారు. 75 ఏళ్లలో 7500 మంది ఎంపీలు, 17 మంది స్పీకర్లు ఈ భవనంలో పనిచేశారని అన్నారు.



Next Story

Most Viewed