వారిని చూసి నేర్చుకోండి.. విపక్షాలకు ప్రధాని మోడీ పరోక్ష కౌంటర్

by Dishafeatures2 |
వారిని చూసి నేర్చుకోండి.. విపక్షాలకు ప్రధాని మోడీ పరోక్ష కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవంపై రాజకీయ దుమమారం కొనసాగుతోంది. అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం పెరిగింది. ఈ కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తూ విపక్షాలు తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోడీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జపాన్, పపువా న్యూ గినియా మరియు ఆస్ట్రేలియా దేశాల పర్యటన ముగించుకుని భారత్ కు తిరిగి వచ్చిన ఆయన గురువారం ఉదయం ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఇటీవల సిడ్నీలో జరిగిన తన కమ్యూనిటీ ఈవెంట్‌ను ప్రస్తావిస్తూ.. 20,000 మందికి పైగా ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారని, ఆ దేశ ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్, మాజీ ప్రధానితో పాటు ఇతర విపక్ష ఎంపీలు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని గుర్తు చేశారు. అధికార, ప్రతిపక్ష నేతలు తమ దేశానికి మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఈ కార్యక్రమంలో వారంతా పాల్గొన్నారని వ్యాఖ్యానించారు. వారంతో కలిసికట్టుగా హాజరై ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారని వ్యాఖ్యానించారు. అయితే కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్న విపక్షాల తీరును ప్రధాని మోడీ ఈ రీతిగా పరోక్షంగా దుయ్యబట్టారనే చర్చ జరుగుతోంది.

ప్రారంభోత్సవానికి 15 పార్టీలు హాజరు

ప్రారంభోత్సవం విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య వార్ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఏయే పార్టీలు ఈ కార్యక్రమానికి హాజరుకాబోతున్నాయనే దానిపై ఆసక్తి నెలకోంది. విపక్షాలు ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ఉమ్మడి ప్రకటన చేయగా బీజేపీతో సహా మరో 15 పార్టీలు ఈ ప్రోగ్రామ్ కు హాజరు కాబోతున్నట్లు ప్రకటించాయి. బీజేపీ, వైసీపీ, టీడీపీ, శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం), అన్నాడీఎంకే, తమిళ్ మనీలా కాంగ్రెస్, భారత మక్కల్ కల్వీ మున్నేట్ర కజగం, నేషనల్ పీపుల్స్ పార్టీ, శిరోమణి అకాలీదళ్, సిక్కిం క్రాంతికారి మోర్చా, నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ, అప్నా దళ్ (సోనీలాల్), రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా, మిజో నేషనల్ ఫ్రంట్, బిజు జనతాదళ్ పార్టీలు ప్రారంభోత్సవానికి హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కార్యక్రమానికి హాజరు కావాలా వద్దా అనే విషయంలో బీఆర్ఎస్ ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని వెలువరించలేదు.

Next Story