బిగ్ న్యూస్: భారత్‌లో MP సీట్ల సంఖ్య పెంపు..? సంచలనంగా మారిన మోడీ కామెంట్స్

by Disha Web Desk 19 |
బిగ్ న్యూస్: భారత్‌లో MP సీట్ల సంఖ్య పెంపు..? సంచలనంగా మారిన మోడీ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్‌లో సీట్ల సంఖ్యపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న సమయంలో ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. త్వరలో ఎంపీల సీట్లు పెరుగుతాయని ప్రధాని వెల్లడించారు. ఆదివారం కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభించిన అనంతరం తొలి సారి సభ సమావేశంలో ప్రధాని ప్రసంగించారు. 2026 తర్వాత జరిగే మొదటి జనగణన ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందన్నారు. పాత పార్లమెంట్‌లో తగినన్ని సీట్లు లేవని, అక్కడ సాంకేతిక సమస్యలు ఉన్నాయని చెప్పారు.

భవిష్యత్‌లో ఎంపీల సంఖ్య పెరగాల్సి ఉందని పాత పార్లమెంట్‌లో కొత్త ఎంపీలకు కూర్చునేందుకు తగినంత స్థలం లేదన్నారు. అందుకే కొత్త పార్లమెంట్‌ను రికార్డు టైమ్‌లో నిర్మించామని చెప్పారు. నిజానికి పార్లమెంట్ సీట్ల సంఖ్య పెంపుపై రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. లోక్ సభలో సీట్ల సంఖ్యను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చర్చ ఉంది. నిబంధనల ప్రకారం పార్లమెంట్ స్థానాల సంఖ్య 2026 తర్వాత కచ్చితంగా పెంచాల్సిన పరిస్థితి ఉంది.

అయితే ఆ గడువును కాస్త ముందుకు జరిపేలా రాజ్యాంగ సవరణ చేయడం కూడా పెద్ద కష్టమైన పనేమి కాదని కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ నిర్ణయం తీసుకుంటే అది సాధ్యమే అనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న 543 లోక్ సభ స్థానాలను 1000కి పెంచాలనే డిమాండ్లు దేశంలోని రాజకీయ ప్రముఖుల నుండి వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రధాని నోటి వెంట లోక్ సభ సీట్ల పెంపు అంశం ప్రస్తావనకు రావడంతో కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేస్తోందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా కొత్త పార్లమెంట్ భవనాన్ని అన్ని హంగులతో 1272 మంది కూర్చునే కెపాసిటీతో నిర్మించారు.


Next Story

Most Viewed