నితీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం..కారణమిదే?

by vinod kumar |
నితీశ్ కుమార్‌పై ప్రశాంత్ కిషోర్ ఆగ్రహం..కారణమిదే?
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రధాని మోడీ పాదాలకు నమస్కరించడంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. నితీశ్ అధికారంలో కొనసాగేందుకు మాత్రమే మోడీ పాదాలను తాకుతున్నారని ఆరోపించారు. తన సిద్దాంతాలతో నితీశ్ రాజీ పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యక్తిగత ప్రయోజనాలకు మాత్రమే ఆలోచిస్తున్నారని విమర్శించారు. జన్ సూరజ్ యాత్రలో భాగంగా భాగల్‌పూర్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రశాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘గతంలో నితీశ్ కుమార్‌తో కలిసి పనిచేసిన నేను ఇప్పుడు ఆయనను ఎందుకు విమర్శిస్తున్నారని ప్రజలు అంతటా నిలదీస్తున్నారు. అప్పుడు నితీశ్ వేరే వ్యక్తి. అతని మనస్సాక్షిని అమ్మకానికి పెట్టలేదు’ అని వ్యాఖ్యానించారు.

ఒక రాష్ట్ర నాయకుడు ఆ రాష్ట్రంలోని ప్రజలకు గర్వకారణంగా ఉండాలని..కానీ మోడీ పాదాలను తాకి నితీశ్ బిహార్‌ను అవమానించారని తెలిపారు. ‘మోడీ తిరిగి అధికారంలోకి రావడంలో నితీశ్ కీలకపాత్ర పోషిస్తున్నారని చాలా చర్చలు జరుగుతున్నాయి. కానీ తన పలుకుబడిని రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగించడం లేదు’అని చెప్పారు. 2025 అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా బీజేపీ మద్దతుతో నితీశ్ అధికారంలో ఉండేలా చూసుకోవాలని సూచించారు. కాగా, ప్రధాని ప్రమాణ స్వీకారానికి ముందు ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశంలో నితీశ్ ప్రధాని మోడీ పాదాలను తాకి నమస్కరించారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ పై వ్యాఖ్యలు చేశారు.Next Story

Most Viewed