జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం!: 24 గంటలుగా కనపించని సీఎం హేమంత్ సొరేన్

by samatah |   ( Updated:2024-01-30 06:50:52.0  )
జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం!: 24 గంటలుగా కనపించని సీఎం హేమంత్ సొరేన్
X

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లో రాజకీయ సంక్షోభానికి తెరపడిన వెంటనే.. తాజాగా జార్ఖండ్‌లో అదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. గత 24గంటలుగా జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ కనిపించడం లేదు. దీంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. భూ కుంభకోణం కేసు విచారణలో భాగంగా సోమవారం ఈడీ అధికారులు ఢిల్లీలోని హేమంత్ సొరేన్ నివాసానికి వచ్చారు. అయితే ఈడీ బృందం వెళ్లక ముందే సొరేన్ అక్కడి నుంచి పరారైనట్టు అధికారులు తెలిపారు. ఇక, అప్పటి నుంచి సొరేన్ కనబడటం లేదని తెలుస్తోంది. దీంతో ఈడీ ఎయిర్ పోర్టు, రోడ్లు మార్గాలపై సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అంతేగాక హేమంత్ సొరేన్ గురించి సమాచారం ఉంటే తెలియజేయాలని సమీప రాష్ట్రాల పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. హేమంత్ సొరేన్, అతని సన్నిహితులకు సంబంధించిన పోన్లన్ని స్విచ్చాఫ్ చేసి ఉన్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే సొరేన్ మంగళవారం సాయంత్రం ఢిల్లీ నుంచి రాంచీకి వెళ్తున్నట్టు ఈడీకి సమాచారం అందింది. దీంతో సొరేన్ బుక్ చేసుకున్న ఫ్లైట్‌ను రద్దు చేసింది. ఈ క్రమంలోనే జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యేలు సమావేశం ఏర్పాటు చేయడంతో ఉత్కంఠ నెలకొంది.

జనవరి 31న రండి: ఈడీకి మెయిల్ చేసిన సొరేన్

హేమంత్ సోరెన్ సోమవారం సాయంత్రం ఈడీకి ఓ మెయిల్ పంపినట్టు సమాచారం. జనవరి 31న మధ్యాహ్నం 1 గంటలకు రాంచీలోని తన నివాసానికి విచారణకు రావొచ్చని మెయిల్‌లో పేర్కొన్నారు. ఈ ఇమెయిల్‌లో ఈడీ దర్యాప్తు రాజకీయ ప్రేరేపితమని తెలిపారు. కాగా, ఈ నెల 20న ఈడీ సొరేన్‌ను 7గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. అయితే విచారణ పూర్తి కాలేదని మరోసారి టైం ఇవ్వాలని పదో సారి సమన్లు జారీ చేసింది.ఈ క్రమంలోనే నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం గమనార్హం.

రాంచీలో భద్రత పెంపు

హేమంత్ సోరెన్‌ను విచారించి అరెస్టు చేస్తారనే ఊహాగానాల మధ్య రాంచీలో భద్రతను పెంచారు. సీఎం నివాసంతోపాటు, ఇతర ముఖ్య ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. జార్ఖండ్ ప్రభుత్వం జనవరి 29న ఉత్తర్వులు జారీ చేసి 14 మంది అదనపు పోలీసు అధికారులను సైతం రాజధానిలో మోహరించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ అధికారులు రాంచీలోనే ఉండాలని పేర్కొంది. మరోవైపు, ముఖ్యమంత్రి క్షేమంగా, తమతో టచ్‌లోనే ఉన్నారని ఆయన పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా తెలిపింది. సీఎం త్వరలోనే రాంచీకి వస్తారని పేర్కొంది.

తదుపరి సీఎంగా హేమంత్ సొరేన్ భార్య!

జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలందరూ మంగళవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీఎం అందుబాటులో లేకపోవడంతో ఈ మీటింగ్‌కి ప్రాధాన్యత ఏర్పడింది. శాసనసభ్యులంతా రాజధానిని విడిచి పెట్టొద్దని పార్టీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి వినోద్ కుమార్ తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్టు వెల్లడించారు. అయితే తదుపరి సీఎంగా హేమంత్ సొరేన్ సతీమణి కల్పనా సొరేన్‌కు బాధ్యతలు అప్పగించేందుకు ఈ భేటీ జరగబోతుందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. కాగా, జేఎంఎం, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)లు జార్ఖండ్‌లో అధికార కూటమిలో భాగంగా ఉన్నాయి.

Advertisement

Next Story