మోడీ చొరబాటుదారులు కామెంట్స్.. కాంగ్రెస్ ఫిర్యాదుని పరిశీలిస్తున్న ఈసీ

by Dishanational6 |
మోడీ చొరబాటుదారులు కామెంట్స్.. కాంగ్రెస్ ఫిర్యాదుని పరిశీలిస్తున్న ఈసీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ చేసిన వివాస్పద వ్యాఖ్యలను పరిశీలిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇటీవలే రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు మోడీ. ఆ ప్రసంగంలో ముస్లింలను ఉద్దేశిస్తూ.. చొరబాటుదారులు అని కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై ఈసీని ఆశ్రయించింది కాంగ్రెస్. మోడీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. అయితే.. కాంగ్రెస్ నుంచి తమకు ఫిర్యాదు అందిందని.. ఆ కామెంట్లను పరిశీలిస్తున్నట్లు తెలిపింది ఈసీ.

కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజల సంపద అంతా ముస్లింలకే పంచుతుందని హాట్ కామెంట్స్ చేశారు మోడీ. ప్రజల దగ్గరనున్న బంగారం సహా సంపద అంతా సర్వే చేసి అందరికీ సమానంగా పంచుతామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో తెలిపిందని పేర్కొన్నారు. దేశ సంపదనంతా చొరబాటుదారులకు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి పంచుతారని అన్నారు. ఆస్తులను జప్తు చేసే అధికారం ప్రభుత్వాలకు ఉందా? మీ కష్టార్జితం చొరబాటుదారులకు ఇవ్వడాన్ని అంగీకరిస్తారా? అని ప్రధాని ఓటర్లను ప్రశ్నించారు. దేశ ఆస్తులపై ముస్లింలకే తొలి హక్కు అని.. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు.

మోడీ కామెంట్లపై కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ విరుచుకుపడ్డాయి. తమ మేనిఫెస్టోలో హిందూ- ముస్లిం అన ఎక్కడుందో చూపాలని డిమాండ్ చేశాయి. ఏళ్లతరబడి భారత్‌లో నివసిస్తున్న మైనార్టీలు చొరబాటుదారులా? గతంలో ఏ ప్రధాని కూడా ఇలా మాట్లాడలేదని కాంగ్రెస్ నేత, లాయర్ కపిల్ సిబాల్ అన్నారు. మోడీకి ఈసీ నోటీసులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అభిషేక్‌ మను సింఘ్వి, గుర్దీప్‌ సప్పల్‌లతో కూడిన కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం సోమవారం ఈసీకి ఫిర్యాదు చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌కుమార్‌తోపాటు కమిషనర్లు జ్ఞానేశ్‌ కుమార్‌, సుఖ్బీర్‌సింగ్‌ సంధులను కలిసి మోడీపైనా, బీజేపీపైనా ఫిర్యాదు చేసింది. మొత్తం 16 ఫిర్యాదులు చేయగా.. వాటిని పరిశీలిస్తున్నట్లు ఈసీ స్పందించింది.

Next Story

Most Viewed