యూపీఏ వర్సెస్ ఎన్‌డీఏ : జాబ్స్ భర్తీలో మోడీ ‘1.5 రెట్ల’ ఫార్ములా.. ఏమిటది ?

by Dishanational4 |
యూపీఏ వర్సెస్ ఎన్‌డీఏ : జాబ్స్ భర్తీలో మోడీ ‘1.5 రెట్ల’ ఫార్ములా.. ఏమిటది ?
X

దిశ, నేషనల్ బ్యూరో : కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ హయాంతో పోలిస్తే తమ ప్రభుత్వం గత పదేళ్లలో 1.5 రెట్లు ఎక్కువ ఉద్యోగాలే ఇచ్చిందని ప్రధానమంత్రి నరంద్రమోడీ అన్నారు. రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో భాగంగా సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లక్ష మందికిపైగా యువతకు ప్రభుత్వ ఉద్యోగాల నియామక లేఖలను ప్రధాని మోడీ పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో చాలా జాప్యం చేసేది. అందుకే లంచం ఇచ్చి పుచ్చుకునే అవకాశం అక్రమార్కులకు కలిగేది’’ అని ఆరోపించారు. తమ ప్రభుత్వం సకాలంలో నియామకాలను చేస్తోందన్నారు. ప్రతిభ ద్వారా ప్రభుత్వ వ్యవస్థలో తమకంటూ ఒక స్థానం లభిస్తుందనే విశ్వాసం ఇప్పుడు యువతకు కలిగిందని ప్రధాని పేర్కొన్నారు. 1.25 లక్షలకుపైగా స్టార్టప్‌లతో పాటు చిన్న నగరాల్లో ఏర్పాటవుతున్న కొత్త సంస్థలు లక్షలాది ఉద్యోగాలను సృష్టిస్తున్నాయని మోడీ చెప్పారు. కోటి ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ పవర్ కోసం తమ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల చాలా మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కేంద్ర బలగాలు రిక్రూట్‌మెంట్ పరీక్షలను ఇప్పుడు హిందీ, ఇంగ్లీషుతో పాటు 13 భారతీయ భాషలలో నిర్వహించడం ప్రారంభించాయని, ఈ మార్పు అభ్యర్థులకు సమాన అవకాశాలను కల్పిస్తుందని ప్రధాని తెలిపారు.


Next Story

Most Viewed